ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 08:16 PM

అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్‌ లేదా ట్రంప్ కార్డ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ గోల్డ్‌ కార్డ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ట్రంప్ బుధవారం ప్రారంభించారు. డబ్బులు చెల్లించిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించనున్నారు. ఒక్కో గోల్డ్ కార్డ్ ఖరీదు 5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా సుమారు రూ.41.7 కోట్లు అని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. లక్షలాది మందికి ఈ గోల్డ్ కార్డ్‌ను విక్రయించడం ద్వారా.. అమెరికా అప్పుల భారాన్ని తగ్గించవచ్చని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రారంభించిన వెబ్‌సైట్‌.. ఎవరెవరు గోల్డ్ కార్డ్ తీసుకునేందుకు ఆసక్తి కలిగి ఉన్నారో తెలుసుకునేందుకేనని అమెరికా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.


"5 మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ వస్తోంది" అని డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది మంది కాల్ చేసి.. ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఈ వెబ్ సైట్ తీసుకువచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ వెబ్‌సైట్‌ పేర్లు నమోదు చేసుకునేందుకు మాత్రమే అందుబాటులో ఉందని.. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కొనుగోలు చేయవచ్చని తెలిపారు.


గోల్డ్‌ కార్డ్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


ట్రంప్ కార్డ్ లేదా గోల్డ్ కార్డ్ ప్రస్తుతం trumpcard.gov అనే వెబ్‌సైట్ ద్వారా ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవచ్చు. అప్లై చేసే వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత దరఖాస్తు కోసమా లేక వ్యాపార పరంగానా అనే వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ కొత్త వెబ్‌సైట్ బంగారు రంగులో ఉన్న ట్రంప్ కార్డు ఫోటోను సూచిస్తుంది. ఆ గోల్డ్ కార్డ్‌పై ట్రంప్ ఫోటో ముద్రించి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ 8 ప్రాంతాల నుంచి దరఖాస్తులను అనుమతిస్తోంది: యూరప్, ఆసియా (మిడిల్ ఈస్ట్‌తోపాటు), ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా ప్రాంతాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.


గోల్డ్ కార్డ్ అంటే ఏంటి?


ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారి గోల్డ్ కార్డ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. ఇది అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు అనుమతినిస్తుంది. ఈ గోల్డ్ కార్డుపై ట్రంప్ ఫోటోతోపాటు ది ట్రంప్ కార్డ్ అని రాసి ఉంది. ఈ గోల్డ్ కార్డ్ 2 వారాల లోపు అందుబాటులో వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పినా.. అది కాస్తా ఆలస్యం అయింది.


అయితే ఈ గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ఇంకా అధికారికంగా ప్రారంభించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ప్రారంభించిన వెబ్‌సైట్ ప్రకారం.. అందులో పేర్లు నమోదు చేసుకుంటే.. అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదట సమాచారం అందుతుందని పేర్కొంటున్నాయి. సాధారణ గ్రీన్ కార్డుతో పోల్చితే ఈ ట్రంప్ కార్డ్ వల్ల.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఉద్యోగ సృష్టికర్తలు వస్తారని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ గోల్డ్ కార్డ్ విక్రయాల వల్ల వచ్చే నిధులతో అమెరికా జాతీయ లోటును తగ్గించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ ట్రంప్ కార్డు అత్యంత విలువైన అమెరికా పౌరసత్వానికి ఒక మార్గమని తేల్చి చెప్పారు. ఈ గోల్డ్ కార్డ్ గతంలో ఉన్న ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో వస్తుందని.. 10 లక్షల మందికి గోల్డ్ కార్డ్‌ను విక్రయించి దేశ అప్పులను తగ్గించేందుకు తగినంత డబ్బును సేకరించవచ్చని ట్రంప్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa