ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ హోస్టెస్ ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది

international |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 09:22 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం రోజ మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ఉండగా.. అందులో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అయితే మృతుల్లోనే మణిపూర్‌కు చెందిన 20 ఏళ్ల కొంగ్రైలత్పం నంగ్తోయి శర్మ అనే క్యాబిన్ సిబ్బంది కూడా ఉండగా.. ఆమె ఇంకా బతికే ఉందనే ఆశతో బతుకుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత నుంచి ఆమెను ఫోన్ చేస్తుండగా.. అది ఇప్పటికీ రింగ్ అవుతూనే ఉందని, ఆన్‌లైన్‌లో ఉన్నట్లే చూపిస్తోందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఆమె బతికుండొచ్చనే నమ్మకం తమకు ఏర్పడుతుందని చెబుతూనే కన్నీటి పర్యంతం అవుతున్నారు.


మణిపూర్‌లోని తౌబల్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల కొంగ్రైలత్పం నంగ్తోయి శర్మ.. ప్రమాదానికి గురైన అహ్మదాబాద్ విమానంలో క్యాబిన్ సిబ్బందిగా విధులు నిర్వహించింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మిగతా వారంతా చనిపోయారని చెప్పారు. కానీ విమాన సిబ్బందిగా పని చేసిన నంగ్తోయి శర్మ మాత్రం ఇంకా బతికే ఉందని ఆమె కుటుంబం నమ్ముతోంది. ప్రమాదం జరిగిన గంటల తర్వాత కూడా ఆమె ఫోన్ మోగుతూ ఉండటంతో.. ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉందని భావిస్తున్నారు.


ముఖ్యంగా విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందే.. నంగ్తోయి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. తాను లండన్ వెళ్తున్నానని. కొద్ది నిమిషాల్లో టేకాఫ్ అవుతామని వివరించినట్లు పేర్కొంటున్నారు. అయితే విమానంలో ఉండడం వల్ల కొంతసేపు మాట్లాడే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్పిందని.. అవే చివరి మాటలు అవుతాయని అస్సలే ఊహించలేదంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే నంగ్తోయి మూడేళ్లుగా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ సిబ్బందిగా పనిచేస్తోందని.. విమాన ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ కాదని చెప్పారు. ఇంఫాల్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో నంగ్తోయి ఎంపిక అయింది.. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఆమె ముంబైలో స్థిరపడినట్లు వివరించారు.


నంగ్తోయికి ఆకాశం అంటే ఎంతో ఇష్టం అని కానీ విమాన ప్రమాదాలంటే చాలా భయపడేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకసారి ఆమె తన కజిన్‌తో విమాన ప్రమాదాలంటే తనకు చాలా భయం అని చెప్పినట్లు గుర్తు చేశారు. ఒకవేళ తాను విమాన ప్రమాదంలో ఇర్కుకుంటే ఏం చేయాలో కూడా తనకు తెలియదని చెప్పినట్లు వివరిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు నంగ్తోయి సోదరి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని చెప్పారు. "నంగ్తోయి చనిపోయిందని తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కానీ ఇలాంటి పోస్టులు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయి" అని ఆమె సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె ఫోన్ చేస్తూనే ఉన్నామని.. చెప్పారు. అది రింగ్ కూడా అయిందని.. కానీ ఎవరూ ఫోన్ ఎత్తలేదని అన్నారు. బ్యాటరీ అయిపోతుందని భావించి 6 గంటల తర్వాత నుంచి ఫోన్ చేయడం ఆపేసినట్లు వెల్లడించారు. నంగ్తోయి ఫోన్ రింగ్‌టోన్ విన్న ప్రతీసారి ఆమె ఇంకా బతికే ఉందని తమకు అనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారికంగా మృతుల జాబితా ఇంకా విడుదల కాకపోవడం, ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉండడంతో ఆమె బతికే ఉందని కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆమెను గుర్తించి వెతకడానికి బంధువులంతా అహ్మదాబాద్‌కు బయలుదేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa