ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 09:28 PM

పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం తప్పదా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. తాజాగా, ఇరాన్‌పై ఇజ్రాయేల్ శుక్రవారం నాడు మెరుపు దాడులు చేపట్టింది. ఇరాన్ అణు కేంద్రం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి చేసింది. ఇజ్రాయేల్ దాడిలో ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో ‘భారీ యుద్ధం’ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.


ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఆ దేశ అధికారిక టీవీ నివేదించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ‘100 శాతం సిద్ధంగా ఉంది’ అని కూడా తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై కూడా ఇజ్రాయేల్ దాడి చేసింది.


ఈ దాడుల అనంతరం ఇజ్రాయేల్ అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ చర్యల అనంతరం టెహ్రాన్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశముందని రక్షణ మంత్రి ఇజ్రాయేల్ కాట్జ్ తెలిపారు. ‘ఇజ్రాయెల్ చేసిన ఆత్మరక్షణ దాడుల తరువాత, టెహ్రాన్ నుంచి మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి జరిగే అవకాశం ఉంది’ అని కాట్జ్ చెప్పారు.


ఈ దాడుల నేపథ్యంలో చమురు ధరలు 6 శాతం వరకు పెరిగాయి. ట్రంప్ ఇప్పటికే ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ఆ ప్రాంతంలోని తమ సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ‘ఇది తక్షణమే జరుగుతుంది చెప్పలేను.. కానీ జరిగేలా కనిపిస్తోంది’ అని ట్రంప్ గురువారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.


ఇరాన్ అణు కార్యక్రమాలపై ఒప్పందం పురోగతిలో ఉందని, అయితే ఇజ్రాయేల్ దాడి దీనికి విఘాతం కలిగించే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేను వాళ్లు (ఇజ్రాయేల్) ముందుకు వెళ్లొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒప్పందాన్ని అడ్డుకుంటుంది’ అని ట్రంప్ అన్నారు. అయితే వెంటనే ‘ఇది సహాయపడొచ్చు కూడా. కానీ ధ్వంసం కూడా చేయొచ్చు’ అని అన్నారు. కాగా, ఇజ్రాయేల్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.


ఇరాక్‌లోని దౌత్య కార్యాలయాల సిబ్బందిని తగ్గిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. ఇరాన్‌తో పోరాటాల్లో ఇరాక్ ప్రధాన కేంద్రంగా ఉంది. అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయేల్.. టెహ్రాన్‌ను ఒక ప్రాణాంతక శత్రువుగా భావిస్తోంది. గతేడాది కూడా ఇజ్రాయేల్ ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మారణహోమానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం మొదలుపెట్టింది.


ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయేల్‌లు ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. ఈ వాదనల నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బుధవారం ఇరాన్ ఒప్పందాలను పాటించడం లేదని తెలిపింది. ఇది 2015 అణు ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంది.


ఈ పరిణామాలతో, అక్టోబర్‌లో ముగియనున్న స్నాప్ బ్యాక్ మెకానిజాన్ని ఐరోపా దేశాలు ప్రారంభించవచ్చని సూచనలున్నాయి. దీనివల్ల ఇరాన్‌పై గతంలో ఎత్తివేసిన ఐక్యరాజ్యసమితి ఆంక్షలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ తన తొలి పదవీకాలంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. ఇరాన్ అణు సంస్థ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ ఈ తీర్మానాన్ని "తీవ్రమైనది"గా పేర్కొన్నారు. ఇది ఇజ్రాయేల్ ప్రభావం వల్లే జరిగిందని ఆరోపించారు.


దీనికి ప్రతిగా ఒక కొత్త యూరేనియం శుద్ధి కేంద్రాన్ని రహస్య ప్రదేశంలో ప్రారంభించనున్నామని ఇరాన్ ప్రకటించింది. ఫోర్డో యురేనియం శుద్ధి ప్లాంట్‌లో ఆరో తరం అధునాతన మెషిన్లు పెట్టనున్నట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ ప్రతినిధి బెహ్రూజ్ కామల్వాండి తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ 60 శాతం స్థాయిలో యూరేనియం శుద్ధి చేస్తోంది, ఇది 2015 ఒప్పందంలో అనుమతించిన 3.67 శాతం కంటే చాలా ఎక్కువ. అయితే అణ్వాయుధానికి అవసరమైన 90 శాతం స్థాయికి ఇంకా తక్కువే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa