ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం అమల్లో.. అక్కడక్కడా పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15000 అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారమే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది. జూన్ 12వ తేదీ తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. జూన్ 13 నుంచి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమవుతోంది. ఈ క్రమంలోనే తమ కుటుంబంలో 12 మందికి తల్లికి వందనం వచ్చిందని, ఐదుగురికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
అయితే తల్లికి వందనం పథకం అర్హుల తుది జాబితాలో పలుచోట్ల పొరబాట్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సరిచేసే పనిలో ఉన్నారు. అర్హులైనవారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో చాలా మంది విద్యార్థులకు ఒకటే తల్లి పేరు కనిపిస్తోంది. ప్యాపిలిలో 96 మంది విద్యార్థులకు ఒకటే తల్లి పేరు కనిపిస్తోంది. ఈ రకంగా ఇద్దరి విషయంలో జరిగింది. ప్యాపిలి సచివాలయం-3 పరిధిలో మౌనిక అనే మహిళ పేరును 96 మంది విద్యార్థులకు తల్లిగా చూపించారు. ప్యాపిలి సచివాలయం-4 పరిధిలో శోభ అనే మహిళను కూడా 96 మంది పిల్లలకు తల్లిగా చూపించారు.
మరోవైపు తల్లికి వందనం పథకం అమలలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకే తల్లి పేరు మీద 340 పిల్లల పేర్లు తల్లికి వందనం పథకం కోసం నమోదు చేశారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఒకే తల్లి పేరుతో 10 నుంచి 30 మంది వరకూ విద్యార్థుల పేర్లు నమోదు చేశారని.. వీరంతా టీడీపీ కార్యకర్తలేనంటూ పోస్టులు పెడుతున్నారు. తల్లికి వందనం పథకం పేరుతో టీడీపీ కార్యకర్తలకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సమయం తెలుగు పరీక్షించగా.. తల్లికి వందనం పథకం 2025 రికార్డులలో మీరు చేర్చబడలేదంటూ సమాధానం వచ్చింది. దీంతో ఈ పోస్టు తప్పుదోవ పట్టించేదిగా భావించవచ్చు.
ఏపీ ప్రభుత్వం క్లారిటీ..
మరోవైపు వైరల్ ట్వీట్లపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన విద్యార్తులకు సంబంధించిన నగదును ఇప్పటికే వారి తల్లులకు విడుదల చేశామని.. అర్హులై ఉండి, జాబితాలో పేర్లు లేని వారు తమ వివరాలు గ్రామ సచివాలయ శాఖ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
దరఖాస్తుదారుల ఫిర్యాదులను పరిశీలించి, అర్హులైతే వారికి కూడా లబ్థి చేకూర్చుతామని.. తల్లిదండ్రులు లేని పిల్లలకు ‘తల్లికి వందనం’ నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ అకౌంటుకు జమచేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత కలెక్టర్ ద్వారా వారికి కూడా తల్లికి వందనం నగదు అందజేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు కలిగిన తల్లుల జాబితానూ పున:పరిశీలించాక వారికి కూడా తల్లికి వందనం నగదు జమ చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతామని పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
మరోవైపు తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో 1,17,739 విద్యార్థుల వివరాల్లో తప్పులు దొర్లినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 83 వేల 325 తప్పులను శనివారం రాత్రికల్లా సరిచేశారు. మిగతా వాటిని సరిచేసే పనిలో ఉన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa