ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా విమానం కూలిపోవడానికి టర్కీ సంస్థే కారణమా?

national |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:40 PM

నాలుగు రోజుల కిందట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం రక్షణ సేవల నిర్వహణలో తమ దేశ సంస్థ ప్రమేయం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలను టర్కీ ఖండించింది. టర్కీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజ్‌ఇన్‌ఫర్మేషన్‌ కౌంటర్ సెంటర్ ప్రకారం.. టర్కిష్ టెక్నిక్ సంస్థ విమానానికి నిర్వహణ సేవలు అందించిందన్న విషయంలో తప్పుడు ప్రచారం జరగుతోందని స్పష్టం చేసింది. ‘ప్రమాదానికి గురైన విమానానికి టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేసిందన్న ఆరోపణలు.. టర్కీ-భారత సంబంధాలపై దుష్ప్రచారంగా భావించాలి’ అని ఎక్స్‌ (Twitter)లో ప్రకటించింది.


జూన్ 12 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 230 మంది ప్రయాణికులు, గ్రౌండ్‌ సిబ్బంది సహా 241మంది మరణించారు. ఒక ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయినవారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు.


టర్కిష్ టెక్నిక్ తమ ప్రకటనలో ‘2024, 2025లో ఎయిర్ ఇండియాతో తమ ఒప్పందం ప్రకారం తమ సంస్థ కేవలం B777-రకం వైడ్‌బాడీ విమానాలకే నిర్వహణ సేవలు అందిస్తుందని తెలిపింది. ఈ ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ఒప్పంద పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం టర్కీ టెక్నిక్, ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 రకానికి ఎప్పుడూ నిర్వహణ అందించిన దాఖలాలు లేవని పేర్కొంది. ఎయిరిండియా ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉన్నట్టు వస్తోన్న ఆరోపణలను ఖండించింది.


ప్రమాదానికి గురైన విమానానికి ఇటీవల మెయింటెనెన్స్ నిర్వహించిన విషయం తమకు తెలుసునని పేర్కొన్నా...‘ఇది మా పరిధికి సంబంధించింది కాదు.. తదుపరి ఊహాగానాలకు అడ్డుకట్టే వేయడానికి మేము దీనిపై ప్రకటన చేస్తున్నాం’ అని తెలిపింది.


‘‘టర్కీ అంతర్జాతీయ రంగంలో ప్రాతినిధ్యం వహించే మా ప్రముఖ బ్రాండ్ల పరువు కాపాడేందుకు మేము పర్యవేక్షణ కొనసాగిస్తాం... అవసరమైన చర్యలు తీసుకుంటాం..ఈ విషాదకర విమాన ప్రమాదంపై భారతీయుల బాధ, ఆవేదనను మేము టర్కీ ప్రజల తరపున పూర్తిగా పంచుకుంటున్నాం’’ అని పేర్కొంది.


ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులు బాయ్‌కాట్ టర్కీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో గ్రౌండ్ డ్యూటీ సేవలు నిర్వహించే టర్కీ సంస్థ సెలెబ్‌కు ప్రభుత్వమే మే 15న భద్రతా అనుమతి రద్దు చేసింది. ఈ నిర్ణయం ప్రకటించిన దాదాపు నెల రోజుల్లోనే ఎయిరిండియా విమాన ప్రమాదం జరగడంతో టర్కీ సంస్థపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.


మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా ఆ మర్నాడు భారతదేశంపై పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లలో ఎక్కువ శాతం టర్కీలో తయారైన Asisguard SONGAR, Bayraktar TB2 డ్రోన్లు ఉండటాన్ని గుర్తించినట్టు భారత్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa