తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (సెర్ప్-ఎంఎస్ఎంఈ) అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కుటుంబం తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.సోమవారం నాడు తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలకలూరు గ్రామానికి చెందిన పొన్నెకంటి సువర్చల శశికిరణ్ కుటుంబ సభ్యులు తమ పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ పేరు మీద సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. ఈ భూమిని సెర్ప్ అధికారులకు మంత్రి మనోహర్ సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా దాతల సేవా నిరతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ, కొలకలూరు గ్రామాభివృద్ధికి తమ కుటుంబం తరపున ఈ చిన్న చేయూత (రూ.10 లక్షలు) అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందనడానికి ఇటువంటి భూదానాలు, విరాళాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందించి, తయారైన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఎగుమతులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa