ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే

national |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 05:55 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవల 3 దేశాల్లో పర్యటించారు. 4 రోజుల్లోనే సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలను సందర్శించారు. ఈ 4 రోజుల పర్యటనల్లో భాగంగా కెనానాస్కిలో జరిగిన జీ7 సదస్సులో.. ప్రధాని మోదీ వివిధ దేశాలకు చెందిన అధినేతలను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళాత్మక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండే హస్తకళలు, కళాఖండాలు, అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ నేతలకు గిఫ్ట్‌లుగా అందించారు. ఈ బహుమతులలో బిహార్‌కు చెందిన ఇత్తడి బోధి వృక్షం.. తమిళనాడు డోక్రా నంది.. ఒడిశా కోణార్క్ చక్రం.. మహారాష్ట్ర కొల్హాపూరి వెండి కుండ.. కాశ్మీరీ సిల్క్ కార్పెట్ వంటి వస్తువులు ఉన్నాయి. ఇవి కేవలం పలు దేశాల అధినేతలకు అందించిన గిఫ్ట్‌లుగా మాత్రమే చూడకుండా.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చూపించేందుకు జీ7 సదస్సు వేదికగా మారింది.


Iకెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీకి ప్రధాని మోదీ ఇత్తడి బోధి వృక్షాన్ని అందించారు. చేతితో చెక్కిన బిహార్‌కు చెందిన ఇత్తడి బోధి వృక్షం విగ్రహాన్ని మార్క్ కార్నీకి.. మోదీ బహుమతిగా ఇచ్చారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి చిహ్నం. దీని వెండి కుండపై పువ్వులు, పైస్లీ డిజైన్‌లు అద్భుతంగా చెక్కి ఉన్నాయి.


డోక్రా నంది


ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధాని మోదీ డోక్రా నంది శిల్పాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన మైనపు పోత పద్ధతిలో తయారు చేసిన ఈ ఇత్తడి నంది బహుమతిని ఇచ్చారు. శివుడి పట్ల భక్తికి ప్రతీకగా డోక్రా నంది ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మోదీ అందించారు.


శాండ్‌స్టోన్ కోణార్క్ చక్రం


జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్‌కు శాండ్‌స్టోన్ కోణార్క్ చక్రాన్ని ప్రధాని మోదీ బహూకరించారు. ఒడిశాకు చెందిన 13వ శతాబ్దపు కోణార్క్ చక్రం ప్రతిరూపాన్ని నరేంద్ర మోదీ ఫ్రీడ్రిక్ మెర్జ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కోణార్క్ చక్రం.. సమయం, కదలిక, విశ్వానికి చిహ్నంగా ఉంటుంది.


కొల్హాపురి వెండి కుండ


ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రధాని మోదీ.. కొల్హాపూరి వెండి కుండను బహుమతిగా అందించారు. మహారాష్ట్రకు చెందిన ఘన వెండితో తయారు చేసిన కొల్హాపూరి వెండి కుండను నరేంద్ర మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. కొల్హాపూరి వెండి కుండను కళాత్మకత, ఆచరణాత్మకత కలయికగా భావిస్తారు.


సిల్వర్ ఫిలిగ్రీ క్లచ్ పర్సు


కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సిల్వర్ ఫిలిగ్రీ క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు. ఒడిశాలోని కటక్‌కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ క్లచ్ పర్సును మోదీ ఆయనకు అందించారు. ఈ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ క్లచ్ కళ 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది.


ఎబోనీ జాలీ వర్క్ బాక్స్


అల్బెర్టా ప్రీమియర్ డానియెల్ స్మిత్‌కు ప్రధాని మోదీ ఎబోనీ జాలీ వర్క్ బాక్స్‌ను గిఫ్ట్‌గా అందించారు. రాజస్థాన్‌కు చెందిన వెండి నక్కాషీతో కూడిన ఎబోనీ వుడ్ జాలీ వర్క్ బాక్స్‌ను ప్రధాని మోదీ ఇచ్చారు. ఈ ఎబోనీ జాలీ వర్క్ బాక్స్‌ మూతపై చేతితో పెయింట్ చేసిన నెమలి చిత్రం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.


పాపియర్ మాషే బాక్స్


అల్బెర్టా లెఫ్టినెంట్ గవర్నర్ సల్మా లఖానీకి పాపియర్ మాషే బాక్స్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన గోల్డ్ లీఫ్ వర్క్‌తో కూడిన పాపియర్ మాషే బాక్స్‌ను గిఫ్ట్‌గా అందించారు. ఇందులో పువ్వులు, చినార్ ఆకులు, పక్షులు, ప్రకృతి దృశ్యాలు చిత్రించి ఉండటంతో మరింత ఆకర్షణీయంగా మారింది.


కేన్ అండ్ బాంబూ బోట్


బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ సిల్వాకు కేన్ అండ్ బాంబూ బోట్ బహుమతిని ప్రధాని మోదీ ఇచ్చారు. మేఘాలయకు చెందిన స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన వెదురు, రెల్లు పడవను నరేంద్ర మోదీ బహుమతిగా అందించారు.


ఇత్తడి డోక్రా గుర్రం


దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ప్రధాని మోదీ.. ఇత్తడి డోక్రా గుర్రం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇత్తడి డోక్రా గుర్రాన్ని అందజేశారు. ఈ ఇత్తడి డోక్రా గుర్రం శక్తి, విధేయతకు ప్రతీకగా ఉంటుంది.


మధుబని పెయింటింగ్ 


దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు ప్రధాని మోదీ మధుబని పెయింటింగ్ గిఫ్ట్‌గా అందించారు. బిహార్‌కు చెందిన మధుబని పెయింటింగ్‌ను ఆయనకు మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ మధుబని పెయింటింగ్‌ను మిథిలా కళ అని కూడా పిలుస్తారు.


వార్లీ పెయింటింగ్ 


మెక్సికన్ అధ్యక్షురాలు క్లౌడియా షైన్‌బామ్ పార్డోకు ప్రధాని నరేంద్ర మోదీ వార్లీ పెయింటింగ్‌ను అందించారు. మహారాష్ట్రకు చెందిన వార్లీ పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ వార్లీ పెయింటింగ్ ఆదివాసీ కళారూపం, దైనందిన జీవితాన్ని వర్ణిస్తుంది.


పఠచిత్ర పెయింటింగ్ 


క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌కు పఠచిత్ర పెయింటింగ్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఒడిశాకు చెందిన పఠచిత్ర పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా అందించారు. ఇది భారతీయ పురాణ కథలను, ముఖ్యంగా కృష్ణుడు, జగన్నాథ సంప్రదాయాన్ని పఠచిత్ర పెయింటింగ్ వర్ణిస్తుంది. క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్‌కోవిక్‌కు వెండి క్యాండిల్‌స్టాండ్ ఇచ్చారు.


కాశ్మీరీ సిల్క్ కార్పెట్ 


సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను బహుమతిగా అందించారు. విలాసవంతమైన కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను మోదీ గిఫ్ట్ ఇచ్చారు. సైప్రస్ ఫస్ట్ లేడీ ఫిలిప్పా కార్సెరాకు సిల్వర్ క్లచ్‌ను ప్రధాని మోదీ బహూకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేతితో తయారు చేసిన ఈ సిల్వర్ క్లచ్‌ను మోదీ ఆమెకు బహుమతిగా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa