ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాట్ జీపీటీ యూజర్ల మెదడు స్కానింగ్.. రిజల్ట్ చూసి అంతా షాక్

international |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 09:10 PM

కొన్నేళ్ల క్రితం వరకు ఏం సందేహం వచ్చినా వారి చుట్టూ ఉండేవారిని అడిగి తెలుసుకునేవాళ్లు. ఆ తర్వాత.. సాంకేతిక పురోగతి, ఇంటర్నెట్ ఆవిర్భావంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ సాయంతో సమాచారం పొందేవారు. ఇప్పుడని మరింత అడ్వాన్స్ అయ్యి.. అవసరమైన సమాచారాన్ని చాట్ బాట్‌లను అడుగుతున్నారు. ఇలాంటి వాటిలో చాట్ జీపీటీ అనే చాట్ బాట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో మనుషులు చేసే పనులు వేగంగా పూర్తవుతున్నా.. కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా చాట్ జీపీటీ ఉపయోగించే వారి మెదళ్లను స్కాన్ చేశారు రీసెర్చర్స్. ఆ పరిశోధన ఫలితాలు చూసి పరిశోధకులు కంగు తిన్నారు. ఆ వివరాలు.


ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు ChatGPT వినియోగదారుల మెదళ్లను స్కాన్ చేశారు. అనతంరం ఆశ్చర్యకరమైన ఫలితాలను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం పెరుగుతున్న కొద్దీ.. యూజర్ల ఆలోచనా విధానంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఈ తాజా పరిశోధన రుజువు చేస్తోంది. ChatGPTని ఉపయోగించి రచనలు చేసిన వారి మెదడు కార్యకలాపాలు, చాట్ బాట్‌ను ఉపయోగించని వారి మెదడు కార్యకలాపాలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని MIT మీడియా ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు.


ఈ పరిశోధనలో 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసున్న 54 మంది వలంటీర్లు పాల్గొన్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక బృందం వ్యాసాలు రాయడానికి ChatGPTని ఉపయోగించింది. మరొక గ్రూపు గూగుల్ సెర్చ్‌ సహాయంతో రాసింది. ఇంకొక గ్రూపు ఏఐను ఉపయోగించకుండా వ్యాసాలు రాసింది. నాలుగు నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. మొదటి మూడు నెలల్లో ప్రతి గ్రూపు నెలకు ఒక వ్యాసం రాయాలని పరిశోధకులు చెప్పారు. అయితే నాల్గో నెలలో.. ఇప్పటివరకు ChatGPTని ఉపయోగించిన కొంతమంది, దాన్ని పక్కకు పెట్టారు. ఉపయోగించని వారు చాట్ జీపీటీని ఉపయోగించడం మొదలు పెట్టారు.


వలంటీర్లు వ్యాసాలు రాశాక.. వారి మెదడు కార్యకలాపాలను ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (electroencephalogram -EEG) యంత్రాల ద్వారా రికార్డ్ చేశారు. దీంతో ChatGPT ఉపయోగించిన గ్రూపులోని వారు మెదడు, భాష, ప్రవర్తన పరంగా తక్కువ పనితీరు కనబరిచినట్లు తేలింది. అంతేకాకుండా, ప్రతి వ్యాసం రాసే కొద్దీ వారిలో సోమరితనం పెరిగిందని తెలిసింది. వారి మెదడులో న్యూరల్ కనెక్టివిటీ తగ్గిందని.. ఆల్ఫా బీటా నెట్‌వర్క్‌లు తక్కువగా పనిచేస్తున్నాయని EEG రిపోర్టులు తేల్చాయి. గూగుల్ సహాయంతో రాసిన వారిలో మెదడు కార్యకలాపాలు సాధారణంగా ఉండగా, ఏఐ సహాయం లేకుండా రాసిన వారిలో మెదడు పనితీరు చాలా చురుకుగా ఉన్నట్లు తేలింది.


EEG అనేది మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను రికార్డ్ చేసే ఒక పరీక్ష. ఇది మెదడు పనితీరును అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఆల్ఫా, బీటా నెట్‌వర్క్‌లు మెదడులో ఆలోచనలు, ఏకాగ్రతకు సంబంధించిన కార్యకలాపాలను సూచిస్తాయి. వాటి పనితీరు తగ్గితే, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. విమర్శనాత్మక ఆలోచన అంటే ఏదైనా విషయాన్ని విశ్లేషించి, దానిలోని మంచి చెడులను తెలుసుకొని ఒక నిర్ణయానికి రావడం.


AI చాట్‌బాట్‌ల వాడకం ప్రజల మెదడు, మనస్సులపై ప్రభావం చూపుతున్నట్లు మునుపటి అధ్యయనాలు తేల్చాయి. యూజర్ల వ్యక్తిగత అనుభవాల ద్వారా ఇదే విషయం బయటపడింది. ChatGPTని ఎక్కువగా ఉపయోగించేవారు దానికి బానిసలుగా మారుతున్నారని, దానిని ఉపయోగించకపోతే విత్‍డ్రావల్ లక్షణాలను (withdrawal symptoms- క్రేవింగ్స్, నిద్ర సమస్యలు, చిరాకు లేదా ఆందోళన, అశాంతి, ఏకాగ్రత లోపించడం, మూడ్ తరచూ మారడం, నిరాశ) ఎదుర్కొంటున్నారని MIT పరిశోధనలో తేలింది.


ఇంతకుముందు.. కార్నెగీ మెల్లన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కలిసి చేసిన అధ్యయనంలో.. చాట్‌బాట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ తగ్గుతున్నాయని కనుగొన్నారు. ఆ తర్వాత కొన్నినెలలకు.. ChatGPT వంటి సాంకేతికత యాజర్లను తెలివి తక్కువ వారినిగా చేస్తుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నట్లు ది గార్డియన్ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా.. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ కూడా.. చాట్‌బాట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన ఆలోచనా నైపుణ్యాలు తగ్గాయని అంగీకరించాడు.


చాలా మంది యూజర్లు.. ChatGPT వల్ల మానసికంగా ప్రభావితమై బానిసలుగా మారుతున్నారు. ఈ మేరకు ఫ్యూచరిజం చేసిన పరిశోధనలో చాట్ జీపీటీ.. యూజర్లను మరింత లోతుగా పారనాయిడ్ భ్రమల్లోకి (Paranoid delusions - లేనిపోని అనుమానాలతో బాధపడటం) నెడుతోందని తేలింది. అయితే విచిత్రమేంటంటే.. చాట్‌బాట్ చెప్పిందని కొందరు యూజర్లు సైకియాట్రిక్ మెడికేషన్‌ కూడా తీసుకోవడం లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.


హింసను ప్రేరేపించే ఐడియాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చాట్ జీపీటీ చెబుతున్నా.. ఏఐ యూజర్లపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆధారాలు ఉన్నాయి. AI.. వినియోగదారులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నప్పటికీ.. టెక్ కార్పొరేషన్లు మాత్రం దీన్ని ప్రతి దాంట్లోనూ విస్తృతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే టెక్ కంపెనీలు విచ్చలవిడిగా ఏఐ ప్రొడక్ట్‌లను తయారు చేయకుండా.. బాధ్యతాయుతంగా ఉండడానికి ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణ విధానాలు తీసుకురావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నియంత్రణ లేని ఏఐ ఎప్పటికైనా చేటే అని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa