రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. 2025 జులై 1వ తేదీ నుంచి రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు రానున్నాయని పేర్కొంది. సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో ఈ మార్పులు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా తత్కాల్ టికెట్లను సామాన్యులు మరింత సులభంగా పొందేందుకే కొత్త మార్పును తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఛార్జీల పెంపు వివరాలు..
భారతీయ రైల్వే శాఖ టికెట్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. అయితే, చాలా స్వల్ప మొత్తంలో పెంచుతున్నట్లు తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత ప్రయాణికుల టికెట్ ఛార్జీలను పెంచుతోంది. ఈ స్వల్ప ఛార్జీల పెంపు 2025 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-AC తరగతి ప్రయాణానికి కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచనున్నట్లు తలిపారు. అదేవిధంగా AC తరగతి ప్రయాణానికి కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతుంది. ఈ పెంపు ప్రయాణికులపై పెద్ద భారాన్ని మోపదని.. రైల్వేల నిర్వహణ ఖర్చులకు కొంత తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.
తత్కాల్ బుకింగ్ కొత్త నిబంధనలు..
ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయడం. ఇది కూడా 2025 జూలై 1 నుంచే అమలులోకి వస్తుంది. "తత్కాల్ పథకం ప్రయోజనాలను నిజమైన అవసరమున్న సాధారణ ప్రజలకు చేరేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాము" అని రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ప్రకటనలో తెలిపింది. జులై ఒకటో తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసుకున్న వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంటే, తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇకపై మీ ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి మరియు ధృవీకరించుకోవాలి.
ఈ నిబంధనను మరింత పటిష్టం చేస్తూ.. జులై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఆధారిత OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ధృవీకరణ కూడా చేయాల్సి ఉంటుంది. దీని అర్థం మీ ఆధార్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేస్తేనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఈ చర్య అనధికారిక ఏజెంట్లు, దళారుల ప్రమేయాన్ని తగ్గించి.. టికెట్లను నిజమైన ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
ఏజెంట్లపై కొత్త పరిమితులు..
రైల్వే శాఖ.. IRCTC అధీకృత బుకింగ్ ఏజెంట్లపై కూడా కొన్ని కఠినమైన పరిమితులు విధించింది. 2025 జూలై 5వ తేదీ నుంచి ఈ ఏజెంట్లు మొదటి రోజున తత్కాల్ టికెట్లను మొదటి అరగంటలో బుక్ చేయకూడదు. AC తరగతి టికెట్లకు ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు, నాన్-AC తరగతి టికెట్లకు ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ సమయం సాధారణ ప్రయాణికులకు నేరుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ మార్పులను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS), IRCTC లను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అలాగే ఈ కొత్త విధానాల గురించి అన్ని రైల్వే జోన్లకు సమాచారం అందించాలని సూచించింది. ఈ సమగ్ర మార్పులు ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. తాజా సమాచారం కోసం ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు సందర్శించాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa