ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా ఆయుధ పరీక్షలకు లైవ్ ల్యాబ్‌గా పాకిస్థాన్.. ఆర్మీ సంచలన నివేదిక!

international |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 11:03 PM

దాయాది పాకి'స్థాన్ ఉపయోగించే సైనిక, ఆయుధ సామగ్రిలో 81 శాతం చైనా తయారు చేసినవేనని, తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్లామాబాద్‌ను ‘ప్రత్యక్ష ప్రయోగశాల’గా బిజింగ్ వాడుకుంటోందని భారత సైన్యం తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతలకు సంబంధించి కీలక వివరాలను ఈ మేరకు ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీడీఎస్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం‘ ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.


‘‘ మే 7న పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొన్ని కీలక పాఠాలు నేర్పింది.. దేశ నాయకత్వం ఇచ్చిన వ్యూహాత్మక సందేశం స్పష్టంగా ఉంది. గతంలో మాదిరిగా ఎలాంటి దాడులను సహించబోం. లక్ష్యాల ఎంపిక, ప్రణాళిక వివిధ వర్గాల సమాచారం ఆధారంగా నిర్ణయించాం.. ఇందులో సాంకేతికత, నిఘా సమాచారాన్ని వినియోగించారు. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించాం. చివరి రోజున లేదా గంటలోనే తొమ్మిది లక్ష్యాలపై దాడి చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం’’ అని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ వివరించారు.


చైనా–పాకిస్థాన్ రక్షణ బంధం సాధారణ ఆయుధ సరఫరా దాటి మరింత లోతుగా వెళ్తోందని అన్నారు. చైనా తన ఆధునిక రాడార్‌లు, పర్యవేక్షణ వ్యవస్థలు వంటి టెక్నాలజీలను ప్రత్యక్ష యుద్ధ పరిస్థితుల్లో పరీక్షించేందుకు పాక్‌న వేదికగా ఉపయోగిస్తోందని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ హెచ్చరించారు.


‘‘ఒకే సరిహద్దు వద్ద మనకు ఇద్దరు కాదు, ముగ్గురు శత్రువులున్నట్టయ్యింది.. ముందున పాకిస్థాన్ ఉండగా.. వెనుక నుంచి చైనా అన్ని విధాలా దానికి సహాయం చేస్తోంది. పాక్ వద్ద ఉన్న సైనిక సామగ్రిలో 81 శాతం చైనా నుంచే వచ్చినవే. చైనా తన ఆయుధాలను ఇతర దేశాల ఆయుధాలతో పోల్చుతూ పరీక్షించగలగటం వారికి ప్రయోగశాల లాంటి అవకాశం కలిగిస్తోంది. టర్కీ కూడా కీలకంగా సహాయం చేసింది. డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో, చైనా ద్వారా పాకిస్థాన్‌కు భారత వాయుసేన కదలికలపై ప్రత్యక్ష సమాచారం అందుతుంది. కాబట్టి మనకు బలమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అవసరం’’ అని ఆయన అన్నారు.


స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం.. 2015 నుంచి ఇప్పటివరకు చైనా పాకిస్థాన్‌కు 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. 2020–2024 మధ్యకాలంలో చైనా ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. చైనా ఆయుధ ఎగుమతుల్లో 63 శాతం పాకిస్థాన్‌కు చేరాయి, తద్వారా చైనాకు అతిపెద్ద కస్టమర్‌గా ఇస్లామాబాద్ నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa