వావహనదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. జాతీయ రహదారులపై వేగ పరిమితులు, బీమా లేని వాహనాలకు జరిమానాల పెంపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు సైతం కఠిన నిబంధనలు విధించనున్నారు. ఈ సవరణల ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్సూరెన్స్ లేని కార్లు, ఇతర వాహనాలు రోడ్డెక్కితే ఇకపై 5 రెట్లు ఎక్కువ పెనాల్టీ విధించేలా కొత్త మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్పీడ్ లిమిట్‌లో స్పష్టత, రహదారి భద్రతను మెరుగుపరచడానికి కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తోంది. ఆగస్టు 3వ తేదీ ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. జాతీయ రహదారులకు కేంద్రం, రాష్ట్ర రహదారులకు రాష్ట్ర ప్రభుత్వాలు వేగ పరిమితులు నిర్ణయిస్తాయి. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరు వేగ పరిమితులు విధిస్తున్నాయి. దీని వల్ల డ్రైవర్లు గందరగోళానికి గురవుతున్నారు. జాతీయ మార్గదర్శకాలను అనుసరించాల్సిన రహదారులపై రాష్ట్రాలు వేర్వేరు పరిమితులు విధిస్తుండటంతో డ్రైవర్లు తెలియకుండానే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ సవరణల ద్వారా వేగ పరిమితులను (Speed Limit) క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల డ్రైవర్లకు జరిమానాలు తగ్గించవచ్చు. అలాగే అమలు చేయడం సైతం సులభమవుతుంది.
ఇక బీమా లేని వాహనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. జరిమానాలు భారీగా పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం బీమా లేకుండా డ్రైవ్ చేస్తే మొదటిసారి రూ. 2,000, ఆ తర్వాత రూ. 4,000 జరిమానా విధిస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఇన్సూరెన్స్ లేని వాహనాల డ్రైవర్లు మొదటిసారి బీమా బేస్ ప్రీమియంకు మూడు రెట్లు, ఆ తర్వాత అయితే ఐదు రెట్లు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇది రూ.20 వేల వరకు ఉంటుందని అంచనా. భారతీయ రోడ్లపై బీమా లేని వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు కూడా కఠిన నిబంధనలు విధించనున్నారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులకు రెన్యూవల్ సమయంలో తప్పనిసరిగా డ్రైవింగ్ పరీక్ష ఉంటుంది. అలాగే 55 ఏళ్లు పైబడిన డ్రైవర్లు లైసెన్స్ పునరుద్ధరించే సమయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరుకావాలి. దీని వల్ల డ్రైవర్లు పూర్తి నైపుణ్యం కలిగి ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదిత సవరణలపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలను కోరిన రోడ్డు రవాణా శాఖ త్వరలోనే క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లు బిల్లు ప్రవేశపెట్టి సవరణలకు ఆమోదం తీసుకోనుంది. ఈ సవరణలను ప్రభుత్వం త్వరలోనే చట్టంగా మార్చే అవకాశం ఉంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. డ్రైవర్లు కూడా నిబంధనలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఇది జరిగేందుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa