ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి సుప్రీం షాక్

national |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 08:40 PM

బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ అంశంపై విచారణ కొనసాగిస్తోన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఈసీకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. ఈ సవరణ ప్రక్రియ చట్టవిరుద్ధమని తేలితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు పక్కనపెట్టాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి బీహార్ ఓటర్ల నుంచి గుర్తింపు పత్రాలను కోరిన ఈసీ చర్యలకు ఈ విధంగా ప్రతిస్పందించింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. ‘పౌరసత్వాన్ని నిర్దారించడానికి ఈసీకి రాజ్యాంగ లేదా చట్టపరమైన అధికారం లేదు అన్నారు. ‘ఐదు కోట్ల మంది పౌరసత్వాన్ని అనుమానించే వ్యవస్థ ఉండకూడదు’ అని పేర్కొన్నారు. ఈసీపై ప్రతిపక్షాలు ఈ విషయంలో యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.


‘‘పౌరసత్వం అనేది భారత ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.. వారు ( ఎన్నికల కమిషన్ ) పౌరసత్వాన్ని నిర్ణయించడానికి ఆధార్ సరిపోదని అంటున్నారు... కానీ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు... గుర్తింపును మాత్రమే నిర్ధారించుకోవాలని కోర్టు చెప్పింది... కానీ ఐదు కోట్ల మంది పౌరసత్వాన్ని అనుమానిస్తున్నారు.. పౌరసత్వానికి పోలీసుగా ఉండటం ఈసీ పనికాదు.. ’’ అని అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.


ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్... పౌరసత్వానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తే... ఓటర్ల జాబితా నుంచి పౌరులు కాని వారిని మినహాయించడం ఈసీ పరిధిలోది’ అని ఎత్తి చూపారు. దీనికి సింఘ్వీ ‘"అవును! (నేను పౌరుడిని కాకపోతే) నాకు పౌరసత్వం లభించే వరకు నన్ను (ఓటర్ జాబితాలో చేరకుండా) అడ్డుకోవచ్చు... కానీ నేను ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉంటే... ఈసీ ఎలా నిర్ణయిస్తుంది?’ అని సింఘ్వీ బదులిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఐదు కోట్ల మంది ఓటర్లను చెల్లనివిగా ప్రకటిస్తే... మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నట్టు’ అని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టవిరుద్దమని నిర్దారణ అయితే వెంటనే నిలిపివేస్తామని ధర్మాసనం తేల్చిచెప్పింది.


దీనికి ముందు ఆర్జేడీ లీడర్ మనోజ్‌ ఝా తరఫున ప్రముఖ లాయర్ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో బతికున్న 12 మందిని చనిపోయినట్టు చూపిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఈసీ తరఫున లాయర్ రాకేశ్ ద్వివేదీ బదులిస్తూ..ఈ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని వాదించారు. ఇటువంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం విడుదల చేసింది ముసాయిదా జాబితా మాత్రమేనని పేర్కొన్నారు.


దీంతో వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి ధర్మాసనం సూచించింది. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లు ఎందరు? గతంలో మరణాల సంఖ్య; ఇప్పుడు మరణాల సంఖ్య వంటి వివరాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలిపింది. ఈసీపై ఆరోపణలు చేస్తోన్న ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పెద్ద ఊరట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల కమిషన్‌పై ఆటమ్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితంగా బీజేపీ గెలిచిందని, ఇందుకు ఈసీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు బిహార్‌లోనూ గెలవడానికి అదే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa