ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనతో అమెరికా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌లతో మోదీ ఆలింగనాలు, కరచాలనాలు చూసి అగ్రరాజ్యం కుళ్లుకుంటోంది. తియాంజిన్‌లో జరుగుతోన్న షాంఘై-కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సాక్షిగా భారత్, చైనాలు చేరువకావడంతో అమెరికాకు నిద్రపట్టడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఎక్స్ వేదికగా స్పందించారు. న్యూఢిల్లీ-వాషింగ్టన్ డీసీ సంబంధాలు 21వ శతాబ్దానికి అతి ముఖ్యమైనవి అని అన్నారు. ఈ సంబంధాలను ఇరు దేశాలు కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘ఈ నెలలో మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులు, పురోగతి, అవకాశాలను మేము హైలైట్ చేస్తున్నాం... ఆవిష్కరణ, వ్యవస్థాపకత నుంచి రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు ఇరు దేశాల ప్రజల మధ్య శాశ్వత స్నేహమే ఈ ప్రయాణానికి ఇంధనంగా నిలుస్తుంది’’ అన్న రూబియో వ్యాఖ్యలను అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక భేటీకి ముందు ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఎస్‌సీఓ సదస్సుకు హాజరైన మోదీ.. చైనా, రష్యా సహా పలు దేశాల నాయకులను కలిశారు.
భారత్‌పై ట్రంప్ టారీఫ్‌ల యుద్ధం ప్రకటించిన తరుణంలో యురేషియాలో కీలకమైన భారతదేశం, చైనా, రష్యాలు SCO శిఖరాగ్ర సదస్సులో భేటీ అయిన వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేయాలని డిమాండ్ చేస్తోన్న అమెరికా.. భారత్ వస్తువులపై 50 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గని భారత్.. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని కుండబద్దలుకొట్టింది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అమెరికా చర్యలు అన్యాయం, అకారణమని భారత్ వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా విధించిన 50 శాతం అదనపు టారీఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రధాని మోదీ, పుతిన్‌లు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని ఒకే వాహనంలో ప్రయాణించడం.. అమెరికా బెదిరింపులకు భారత్ లొంగిపోదని, రష్యాతో తమ దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతీయవని సూచిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు జిన్‌పింగ్‌ను కలుసుకోగా.. ఆ ముగ్గురూ నవ్వుతూ కనిపించారు. ఆ ఉత్సాహభరితమైన సంభాషణ వారు చర్చించిన అంశాలు అనేక ఊహాగానాలకు దారితీసింది. ఇది అమెరికాను మరింత కలవరానికి గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa