ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టబ్బుల్లో వరదనీటిని నిల్వ చేయమన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై చర్చల దుమారం

international |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:43 PM

పాకిస్థాన్‌ను భారీ వరదలు (Pakistan Floods) విస్తృతంగా ప్రభావితం చేస్తున్నాయి. లక్షల మందిని ఇబ్బందులు పెట్టుతున్న ఈ విపత్తుపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ (Khawaja Asif) ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.వరదనీటిని శాపం కాకుండా అదృష్టంగా చూడాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నీటిని వృథా పోనివ్వకుండా ఇంటి వద్ద టబ్‌లు, కంటెయినర్లలో నిల్వ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.పంజాబ్‌ సహా పాక్‌లోని అనేక ప్రావిన్సుల్లో రికార్డు స్థాయిలో వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఇప్పటికే 2వేలకుపైగా గ్రామాలు వరదలతో మునిగిపోయాయి. లక్షలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఒక్క పంజాబ్‌లోనే సుమారు 7లక్షల మంది పునరావాసం పొందినట్లు అంచనా. పాక్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) వివరాల ప్రకారం జూన్‌ 26 నుంచి ఆగస్టు 31 మధ్యకాలంలో వరదల కారణంగా 854 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వ సహాయ చర్యలు ఆలస్యం కావడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఒక స్థానిక మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడుతూ.. ''ప్రజలు నిరసనలకు దిగే బదులు, ముందు ఆ నీటిని సేకరించుకోవాలి. ఇంట్లో ఉన్న టబ్‌లు, కంటెయినర్లలో నీటిని నిల్వ చేస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ వరదనీటిని శాపం కాదని, ఒక అవకాశంగా చూడాలి'' అని అన్నారు. అంతేకాకుండా పెద్ద ప్రాజెక్టుల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడకుండా, త్వరగా పూర్తయ్యే చిన్న డ్యామ్‌లు నిర్మించుకోవడం మంచిదని సూచించారు. నీటిని వృథా చేయకుండా నిల్వ చేసుకోవడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa