దేశవ్యాప్తంగా ఉన్న యాచకుల వసతి గృహాలు శిక్షా కేంద్రాలుగా కాకుండా, గౌరవప్రదమైన పునరావాస కేంద్రాలుగా మారాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవి జైళ్లను తలపించేలా ఉండకూడదని, నివాసితుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తేల్చిచెప్పింది. ఢిల్లీలోని లంపూర్ బెగ్గర్ హోమ్‌లో కలుషిత నీటి కారణంగా నివాసితులు మరణించిన ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రక ఆదేశాలు జారీ చేసింది."బెగ్గర్ హోమ్‌ల పాత్ర శిక్షించేలా కాకుండా, బాధితులను కోలుకునేలా చేసి, వారిలో నైపుణ్యాలు పెంచి, తిరిగి సమాజంలో కలిసేలా చేసేదిగా ఉండాలి. 'హోమ్' అనే పదానికే భద్రత, గౌరవం, సంరక్షణ అనే అర్థాలున్నాయి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధిక జనాభా, అపరిశుభ్రత, వైద్య సదుపాయాల లేమి వంటి పరిస్థితులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని కోర్టు పేర్కొంది. పేదరికాన్ని నేరంగా చూసే వలసవాద చట్టాల వారసత్వాన్ని విడిచిపెట్టి, సామాజిక న్యాయం అందించే ప్రదేశాలుగా ఈ హోమ్‌లను మార్చాలని సూచించింది.ఈ సందర్భంగా దేశంలోని అన్ని బెగ్గర్ హోమ్‌లకు వర్తించేలా సుప్రీంకోర్టు పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:వైద్యం, ఆరోగ్యం హోమ్‌లో చేరిన ప్రతి వ్యక్తికీ 24 గంటల్లోగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతినెలా ఆరోగ్య తనిఖీలు చేయడంతో పాటు, అంటువ్యాధులు ప్రబలకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, కీటకాల నివారణ వంటి చర్యలు చేపట్టాలి.ఆహారం, వసతిపోషకాహార నిపుణుడి పర్యవేక్షణలో నాణ్యమైన భోజనం అందించాలి. హోమ్‌లలో పరిమితికి మించి జనాభా ఉండకుండా చూడాలి. సరైన గాలి, వెలుతురు ఉండేలా వసతులు కల్పించాలి.పునరావాసం, హక్కులు నివాసితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వారికి అర్థమయ్యే భాషలో చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించాలి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక, సురక్షితమైన వసతులు ఉండాలి. భిక్షాటన చేస్తూ దొరికిన పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ సంస్థలకు తరలించాలి .జవాబుదారీతనం హోమ్‌ల పర్యవేక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాలి. ఎవరైనా నివాసి నిర్లక్ష్యం కారణంగా మరణిస్తే, వారి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ మార్గదర్శకాలను ఆరు నెలల్లోగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించి ఒక ఉమ్మడి విధానాన్ని మూడు నెలల్లోగా రూపొందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు సూచించింది. తీర్పు కాపీలను తక్షణమే అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa