ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అతి పురాతన కంపెనీలు.. 1400 ఏళ్లకు పైగా వ్యాపారాలు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 09:58 PM

వ్యాపారాలు చేయడం అంటే చాలా కష్టం. మార్కెట్‌లో బిజినెస్ ప్రారంభించి.. దాన్ని కొనసాగించి.. కస్టమర్లను మళ్లీ మళ్లీ తమ ఉత్పత్తులు కొనేలా చేయాలంటే.. ఆ కంపెనీలు ఎన్నో పాట్లు పడుతూ ఉంటాయి. రోజురోజుకూ బిజినెస్ పెంచుకునేందుకు.. సరికొత్త వ్యూహాలను రచించి అమలు చేస్తాయి. కొన్నేళ్ల పాటు స్థిరంగా వ్యాపారం కొనసాగించాలంటే.. ఏ కంపెనీకైనా చాలా కష్టమే. సవాళ్లు ఎదురైనపుడు.. వాటిని తట్టుకుని నిలబడగలిగితేనే అవి మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతాయి. ఇక ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని.. కస్టమర్లను ఆకర్షిస్తేనే.. మనుగడ సాగించవచ్చు. అయితే కొన్ని కంపెనీలు తరతరాలుగా బిజినెస్‌లో రాణిస్తూనే ఉంటాయి. తాతలు స్థాపించిన కంపెనీలను వారి కుమారులు, మనవళ్లు, మునిమనవళ్లు ఇలా తరాలు మారినా.. వ్యాపారాన్ని వదలకుండా కొనసాగిస్తూనే ఉంటారు. ఇలా పదులు, వందల సంవత్సరాల నుంచి.. కుటుంబ వ్యాపారాలను సాగించేవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు.


ప్రపంచంలో నిరంతరం పనిచేస్తున్న అత్యంత పురాతన సంస్థల్లో నాలుగు జపాన్‌లోనే ఉన్నాయి. ఇందులో 578 సంవత్సరంలో స్థాపించబడిన దేవాలయ నిర్మాణ సంస్థ కొంగో గుమి, 705 సంవత్సరంలో ప్రారంభమైన హోటల్ నిషియామా ఒన్సెన్ కీయుంకన్ ప్రధానమైనవి. అయితే ఈ సంస్థలు 1400 ఏళ్లకుపైగా వ్యాపారంలో మనుగడ కొనసాగించడానికి సంప్రదాయం, నైపుణ్యం, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడమే కారణం అని తెలుస్తోంది. ఇక రోజురోజుకూ వస్తున్న మార్పులను గౌరవిస్తూ.. కంపెనీల మూలాలను కాపాడుకుంటేనే వ్యాపారంలో దీర్ఘకాలికంగా విజయం సాధించగలమని ఈ వారసత్వ సంస్థలు నిరూపిస్తున్నాయి. వరల్డ్ అట్లాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలో నిరంతరం పనిచేస్తున్న 4 అతి పురాతన సంస్థలు జపాన్‌లో ఉన్నాయి. అవి కొంగో గుమి, నిషియామా ఒన్సెన్ కీయుంకన్, సెన్నెన్ నో యు కోమన్, హోషి ర్యూకాన్.


కొంగో గుమి


జపాన్‌లోని ఒసాకా నగరంలో ఈ కొంగో గుమి అనే సంస్థను 578 ఏడాదిలో స్థాపించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నిర్మాణ సంస్థ. ఈ కొంగో గుమి.. బౌద్ధ దేవాలయాల నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉంది. 1400 ఏళ్లకు పైగా ఒకే కుటుంబం ఈ కంపెనీని నడిపిస్తోంది. 17వ శతాబ్దం నాటి రికార్డుల ప్రకారం.. ఆ సంస్థకు చెందిన 40 తరాల నాయకత్వానికి సంబంధించి డాక్యుమెంట్ చేశారు. 21వ శతాబ్దంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. 2006లో ఈ కొంగో గుమి సంస్థ తకమట్సు కన్‌స్ట్రక్షన్ గ్రూప్‌లో అనుబంధ సంస్థగా మారింది. దేవాలయాల రూపకల్పనలో కాంక్రీటుతో చెక్కను కలపడం.. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్) వంటి ఆధునిక టెక్నాలజీని తొందరగా స్వీకరించడం ఈ సంస్థకు ఉన్న నైపుణ్యానికి నిదర్శనం.


నిషియామా ఒన్సెన్ కీయుంకన్


జపాన్‌లోని యమనాషి నగరంలో 705 సంవత్సరంలో ఈ నిషియామా ఒన్సెన్ కీయుంకన్ సంస్థను స్థాపించారు. ఈ నిషియామా ఒన్సెన్ కీయుంకన్.. ప్రపంచంలోనే అత్యంత పురాతన హోటల్‌గా ప్రసిద్ధి చెందింది. సహజమైన హాట్ స్ప్రింగ్స్‌కు ఈ నిషియామా ఒన్సెన్ కీయుంకన్ ప్రసిద్ధి. 2017 వరకు 52 తరాలుగా ఒకే కుటుంబం ఈ నిషియామా ఒన్సెన్ కీయుంకన్ హోటల్‌ నిర్వహణను చూసుకుంది. ఇందులో దైమ్యో టకేడా షింగెన్, చక్రవర్తి నరుహిటో వంటి చారిత్రక ప్రముఖులు అతిథులుగా ఉన్నారు.


సెన్నెన్ నో యు కోమన్


జపాన్‌లోని హ్యూకే గొన్నోకామి 717 సంవత్సరంలో ఈ సెన్నెన్ నో యు కోమన్ సంస్థను ప్రారంభించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రెండో పురాతన హోటల్ కాగా.. మూడో పురాతన కంపెనీగా కొనసాగుతోంది. కినోసాకి నగరంలో ఉన్న ఈ హోటల్ గత 46 తరాలుగా కొనసాగుతోంది. సాంప్రదాయ ర్యూకాన్ శైలిలో.. హాట్ స్ప్రింగ్స్‌తో ఉంటుంది.


హోషి ర్యూకాన్


జపాన్‌ ఇషికావా నగరంలోని అవాజు ఒన్సెన్‌లో 718 సంవత్సరంలో ఈ హోషి ర్యూకాన్‌ సంస్థను స్థాపించారు. ప్రపంచంలో నిరంతరం నడుస్తున్న అత్యంత పురాతన కుటుంబ వ్యాపారంగా ఈ హోషి ర్యూకాన్‌ను పరిగణిస్తారు. గత 46 తరాలుగా హోషి కుటుంబం ఈ హోషి ర్యూకాన్ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. ఇది నిషియామా ఒన్సెన్ కీయుంకన్ కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత పురాతన హోటల్‌గా ఉండేది.


కంపెనీల సక్సెస్‌కు కారణాలు


ఈ సంస్థలు సుదీర్ఘ కాలం మనుగడ సాగించడం అనేది.. ఇప్పటి వ్యాపారాలకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. యుద్ధాలు, విపత్తులు, ఆర్థిక మార్పులు నెలకొన్నప్పటికీ ఈ సంస్థలు మాత్రం నిలదొక్కుకుని మార్కెట్‌లో వ్యాపారాలను చేస్తున్నాయి. అయితే ఒక బిజినెస్ సక్సెస్ కావడం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదని.. నిబద్ధత, ఉద్దేశ్యం, పట్టుదల ముఖ్యమని ఇవి నిరూపిస్తున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులను స్వీకరించడం, కొత్త ఆవిష్కరణలను చేర్చుకోవడం వల్లే ఈ కంపెనీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa