మత సామరస్యాన్ని చాటిచెప్పే అపూర్వ ఘట్టం కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణలో ఆవిష్కృతమైంది. మంగళవారపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ముస్లిం నాయకుడు సయ్యద్ ఉల్లా సఖాఫ్.. శిథిలావస్థకు చేరిన శ్రీబసవేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇందుకోసం వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. నవంబర్ 1వ తేదీన కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా ఈ కొత్త ఆలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో.. మూడు రోజుల పాటు అన్నదానంతో సహా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈక్రమంలోనే ముస్లిం వ్యక్తి అయినా.. హిందూ ఆలయం కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చిన సఖాఫ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణంలో కేవలం సఖాఫ్ దాతృత్వమే కాక స్థానికుల సహకారం కూడా ఉంది. ఈ గ్రామానికి చెందిన కెంపమ్మ, మోటేగౌడ అనే ఇద్దరు స్థానికులు ఆలయ విస్తరణకు తమ సొంత స్థలాన్ని ఉచితంగా విరాళంగా ఇచ్చారు. ఒకప్పుడు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నా.. శిథిలమై కేవలం ద్వారం మాత్రమే మిగిలిన ఈ పాత ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని సఖాఫ్ స్థానికులను అడగగా గ్రామం మొత్తం సంతోషంగా అంగీకరించింది. ఇలా ఆలయం పునరుద్ధరణ జరగ్గా.. ఇప్పుడిది ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. అయితే ఇలా హిందూ గుడులకు సాయం చేయడం సయ్యద్ ఉల్లా సఖాఫ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన సన్తేహ్ మోగేనహళ్లిలో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఒకే కాంపౌండ్‌లో హిందూ ఆలయాన్ని, ముస్లిం సమాధిని నిర్మించి మతసామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు.
ఎస్‌కే గ్రూప్ యజమాని అయిన సయ్యద్ ఉల్లా సఖాఫ్.. ఈ సందర్భంగా తన సిద్ధాంతాన్ని స్పష్టం చేశారు. మనం చేసే పనులను చూసే పిల్లలు పెరుగుతారు, అవే నేర్చుకుంటారని చెప్పారు. హిందూ ముస్లింలు కలిసే ఉండాలని భవిష్యత్ తరాల పిల్లలు భావించాలన్నా, రెండు మతాలను గౌరవించాలన్నా ఇలా చేయాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా ప్రపంచం మొత్తంతో శాంతితో విలసిల్లాలంటే మత గొడవలు ఉండకూడదని.. హిందువులు, ముస్లింలు కలిసి జీవించడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. "మనం అందరం అన్నదమ్ముల్లా ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకరితో ఒకరు పోరాడుకుంటే భారతదేశం అభివృద్ధి చెందదు. మన దేశం ప్రపంచాన్ని పాలించాలంటే, మనం అందరినీ గౌరవించాలి" అని సఖాఫ్ ఇచ్చిన సందేశాన్ని గ్రామస్థులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ మాజీ పూజారి మహాదేవ్ కుమారులైన చందన్, మహేష్, మనోజ్ ఆలయ కార్యక్రమాలను నిర్వహించగా.. పండితులు విద్వాన్ నాగేంద్ర శాస్త్రి, మంజునాథ్ ఆరాధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa