ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ ఎన్నికల్లో లక్ అంటే వీళ్లదే.. 27 ఓట్లతో విజయం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:18 PM

ఎన్నికల్లో గెలిచి.. అధికారాన్ని చేపట్టాలి అంటే చాలా కష్టపడాలి. కొన్నిసార్లు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ మనవైపే ఉన్నా.. విజయం మాత్రం ప్రత్యర్థి వశమైన సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఒకసారి విజయం సాధిస్తే.. 5 ఏళ్ల పాటు ఆ కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతీ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలై విజయానికి దూరమైన వారు చాలా మందే ఉంటారు. ఇక వారిపై గెలిచిన వారు మాత్రం ఊపిరి పీల్చుకుంటారు. స్వల్ప ఓట్లతో గెలిచినవారు అది తమ లక్ అనుకుంటే.. ఓడిన వారు మాత్రం.. తమ తలరాత అనుకుంటూ ముందుకు సాగుతారు. అయితే ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలే పలు నియోజకవర్గాల్లో కనిపించాయి.


ఈ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి.. తుది ఓటు లెక్క పూర్తయ్యే వరకు కొన్ని నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అనే రేంజ్‌లో అభ్యర్థులకు ఓట్లు రావడం గమనార్హం. చివరికి స్వల్ప తేడాతోనే గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. సందేశ్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి దీపు సింగ్‌పై జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సా.. కేవలం 27 ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. విజేతకు 80,598 ఓట్లు రాగా.. ఓడిపోయిన అభ్యర్థి 80,571 ఓట్లు సాధించారు.


ఇక రామ్‌గఢ్ సీటులో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌పై బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్.. కేవలం 30 ఓట్లతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. అయితే బిహార్ ఎన్నికల్లో బీఎస్పీకి ఏకైక విజయాన్ని అందించిన సీటు ఇదే కావడం గమనార్హం. ఇక అగియాన్ స్థానంలో సీపీఐఎంఎల్ అభ్యర్థి శివ్ ప్రకాష్ రంజన్‌పై బీజేపీ అభ్యర్థి మహేష్ పాశ్వాన్ 95 ఓట్లతో గెలిచారు. ఢాకా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ జైస్వాల్‌పై.. ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ 178 ఓట్లతో విజయం సాధించారు. ఇక ఫోర్బ్స్‌గంజ్ సీటులో.. బీజేపీ అభ్యర్థి విద్యా సాగర్ కేశరిపై కాంగ్రెస్ నేత మనోజ్ బిశ్వాస్ 221 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.


బిహార్ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన టాప్ 5 అభ్యర్థులు


నియోజకవర్గం విజేత (పార్టీ) ఓడిన అభ్యర్థి (పార్టీ) మెజారిటీ తేడా


సందేశ్ రాధా చరణ్ సా (జేడీయూ) దీపు సింగ్ (ఆర్జేడీ) 27 ఓట్లు


రామ్‌గఢ్‌ సతీష్ కుమార్ సింగ్ యాదవ్ (బీఎస్పీ) అశోక్ కుమార్ సింగ్ (బీజేపీ) 30 ఓట్లు


అగియాన్ మహేష్ పాశ్వాన్ (బీజేపీ) శివ్ ప్రకాష్ రంజన్ (సీపీఐ(ఎంఎల్)(ఎల్)) 95 ఓట్లు


ఢాకా ఫైసల్ రెహమాన్ (ఆర్జేడీ) పవన్ కుమార్ జైస్వాల్ (బీజేపీ) 178 ఓట్లు


ఫోర్బ్స్‌గంజ్ మనోజ్ బిశ్వాస్ (కాంగ్రెస్) విద్యా సాగర్ కేశరి (బీజేపీ) 221 ఓట్లు


బిహార్‌లో ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో 200కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 243 స్థానాల్లో 203 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా.. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితమై దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం).. సీమాంచల్ ప్రాంతంలో కొంతవరకు తమ ఉనికిని చాటుకుని 5 సీట్లతో.. ప్రాంతీయంగా ఓట్లను చీల్చగలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa