ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు.. రోజుకు 2 లక్షల మంది

national |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 08:41 PM

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైన రెండో రోజునే భక్తుల రద్దీ పెరగడంతో అనేక సమస్యలు తలెత్తాయి. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం తెరుచుకోవడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. మంగళవారం రోజున లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో గంటల తరబడి నిరీక్షించిన వారికి తాగునీటి కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడటంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భక్తులు క్యూలైన్లను ఉల్లంఘించి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడం అక్కడ భయంకరమైన పరిస్థితికి కారణం అయింది.


ఈ భారీ భక్తుల రద్దీకి సంబంధించి అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) స్పందించింది. ఈ పరిస్థితిపై కొత్తగా నియమించిన టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీగా, ప్రమాదకరమైన భక్తుల రద్దీని తాను ఇంతవరకు శబరిమల ఆలయ ప్రాంగణంలో చూడలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. శబరిమలకు ఎంత మంది భక్తులు పోటెత్తారో అర్థం అవుతోంది. కొందరు క్యూలైన్‌లను దాటుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని.. భారీగా తరలివస్తున్న గుంపును చూసి తాను కూడా భయపడుతున్నానని కె.జయకుమార్ పేర్కొన్నారు.


ఇక శబరిమలలో భక్తుల రద్దీని నియంత్రించడానికి, క్యూ లైన్లలో వారు పడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడిన భక్తులకు నీరు అందించడానికి 200 మంది అదనపు సిబ్బందిని నియమించారు. భక్తులు దర్శనం కోసం 18 పడి మెట్లు (పదునెట్టాంబడి) ఎక్కేటప్పుడు భక్తులను కనిపెట్టుకుంటూ ఉండాలని.. భక్తులు ఎవరూ క్యూలైన్లను ఉల్లంఘించకుండా అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.


పంబ నది వద్ద భక్తుల రద్దీని తగ్గించడానికి.. భారీగా వచ్చే భక్తులను నిలక్కల్ వద్దే కొంత కంట్రోల్ చేయాలని ఆదేశించారు. నిలక్కల్‌లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసి.. పంబ వరకు రాకుండా అక్కడే దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇస్తున్న రోజుకు స్పాట్ బుకింగ్‌ల సంఖ్యపై పరిమితి విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా టాయిలెట్ల శుభ్రత కోసం తమిళనాడు నుంచి సుమారు 200 మంది క్లీనింగ్ సిబ్బందిని తీసుకువస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు.


నవంబర్ 16వ తేదీన సాయంత్రం శబరిమల సన్నిధానం తెరిచినప్పటి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్నారని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. క్యూ కాంప్లెక్స్‌లలోకి వస్తే నీరు, బిస్కెట్లు అందించడం సులభం అవుతుందని.. కానీ క్యూలైన్లలో వస్తే.. ముందుగా దర్శనం కాదనే భయంతో భక్తులు వాటిని ఉపయోగించకుండా.. బయటి నుంచి వస్తున్నారని టీడీబీ అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa