ప్రతిష్ఠాత్మకమైన దుబాయ్ ఎయిర్ షోలో సంచలనం జరిగింది. ఏరియల్ డిస్‌ప్లేలో పాల్గొన్న ఒక భారతీయ యుద్ధ విమానం ప్రమాదానికి గురై.. కూలిపోయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ఏఎల్ ) తయారుచేసిన తేజస్ ఫైటర్ జెట్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో.. గాల్లో చక్కర్లు కొడుతుండగా అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఈ దుబాయ్ ఎయిర్ షోను వీక్షించడానికి భారీగా తరలివచ్చిన జనం.. అక్కడ గుమిగూడారు. తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనలో దాన్ని నడుపుతున్న పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు.. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇక తేజస్ యుద్ధ విమానం.. గాల్లో గింగిరాలు తిరిగి నేలను ఢీకొట్టిన వెంటనే క్రాష్ అయింది. దీంతో ఆ ప్రాంతం నుంచి దట్టమైన, నల్లటి పొగ కమ్ముకుంది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ సందర్భంలో పైలట్ కుటుంబానికి ఐఏఎఫ్ అండగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ తేజస్ యుద్ధ విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, సంబంధిత అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎయిర్ షోలో భాగంగా నెగిటివ్ గ్రావిటీ ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ ఆ ఫైటర్ జెట్‌ను కంట్రోల్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెగటివ్ గ్రావిటీ ఫోర్స్ అంటే.. యుద్ధ విమానాలు వేగంగా ఎగురుతూ కిందికి పల్టీలు కొట్టడం, తలకిందులుగా ఉండి చేసే విన్యాసాలు. సాధారణంగా ఇలాంటి నెగటివ్ గ్రావిటీ ఫోర్స్ విన్యాసాల సమయంలో పైలట్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ నెగటివ్ గ్రావిటీ ఫోర్స్ నుంచి సరైన సమయంలో యుద్ధ విమానాన్ని సాధారణ స్థితికి తీసుకురాలేకపోతే.. అది కంట్రోల్ తప్పి కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
మరోవైపు.. ఈ తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి.. ఇటీవల నెట్టింట జరిగిన ప్రచారం.. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ ఎయిర్ షో 2025లో భాగంగా పాల్గొనే భారత లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన తేజస్ ఎంకే1 ఫైటర్ జెట్ నుంచి ఆయిల్ లీకవుతోందని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి.
అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆ వైరల్ వీడియోల్లో కనిపించే ద్రవం లీకేజీ కాదని.. అది కేవలం తేమ అధికంగా ఉండే దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఫైటర్ జెట్ ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ సిస్టమ్, ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ నుంచి బయటకు విడుదల అయ్యే సాధారణ నీరు అని తెలిపింది. భారతీయ ఫైటర్ సాంకేతిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీఐబీ తేల్చి చెప్పింది. ఇలాంటి తరుణంలోనే తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడంతో మళ్లీ నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం గత రెండు సంవత్సరాలలో రెండోసారి కావడం గమనార్హం. 2001లో మొదటి పరీక్షా విమానం ఎగిరిన తర్వాత 23 ఏళ్ల చరిత్రలో.. 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్ విమానం మొట్టమొదటిసారి కూలిపోయింది. అయితే ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటకు దూకగలిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa