ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో హమాస్ భారీ సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్

international |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 10:06 PM

హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు గాజా స్ట్రిప్‌పై తమ దాడులను కొనసాగిస్తున్నాయి. హమాస్‌ ఉగ్రవాద సంస్థను పూర్తిగా అంతం చేయడమే ఈ దాడుల లక్ష్యం కాగా.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఇప్పటి వరకు బయటపడ్డ వాటిలో అత్యంత భారీ, సంక్లిష్టమైన హమాస్‌ టన్నెల్‌ను గుర్తించాయి. ఈ టన్నెల్‌ నిర్మాణ తీరుతెన్నులు, అందులోని వసతులు చూసి ఇజ్రాయెల్ సైన్యం ఆశ్చర్య పోయింది. ముఖ్యంగా 7 కిలో మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతు, 80 గదులతో ఉండడంతో ముక్కున వేలేసుకుంటుంది.


సొరంగం నిర్మాణ వివరాలు..


ఐడీఎఫ్‌ గుర్తించిన ఈ సొరంగం దాదాపు 7 కిలో మీటర్ల పొడవు ఉంది. భూమి ఉపరితలం నుంచి 25 మీటర్ల లోతులో నిర్మించిన ఈ టన్నెల్‌లో ఏకంగా 80 గదులు ఉన్నాయి. ఈ భారీ సొరంగం యొక్క అంతర్గత దృశ్యాలతో కూడిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. లోపల టైల్స్‌తో సహా పక్కా నిర్మాణాలు చేపట్టడంతో.. దీన్ని దాదాపు ఓ భూగర్భ నగరంగా హమాస్‌ నిర్మించుకుందని ఐడీఎఫ్‌ దళాలు వెల్లడించాయి. సొరంగంలో పడక గదులు, పశ్చిమ దేశాల తరహా టాయిలెట్‌లతో కూడిన బాత్రూమ్‌లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు వంటి ప్రత్యేక సదుపాయాలను హమాస్‌ ఏర్పాటు చేసుకుంది. దీర్ఘకాలికంగా నివాసం ఉండేందుకు అవసరమైన అన్ని వసతులతో పాటు భారీగా ఆయుధ నిల్వలను కూడా ఐడీఎఫ్‌ ఈ టన్నెల్‌లో స్వాధీనం చేసుకుంది.


 ఈ సొరంగం హమాస్‌కు చెందిన అత్యంత కీలకమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు నిర్ధారించాయి. హమాస్‌ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్, మొహమ్మద్ షబానా వంటి వారు ఇందులో తలదాచుకునేవారని ఐడీఎఫ్‌ తెలిపింది. ఈ టన్నెల్‌ నిర్మాణ సంక్లిష్టత, అందులోని అధునాతన సదుపాయాలు హమాస్ నాయకత్వానికి, సాధారణ ఉగ్రవాదులకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.


ఐడీఎఫ్‌ అధికారి, లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ మృతదేహాన్ని గతంలో అపహరించి.. ఈ సొరంగంలోనే బంధించినట్లు ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. గోల్డిన్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను కూడా ఈ టన్నెల్‌లో స్వాధీనం చేసుకున్నారు. మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ భారీ సొరంగం జనసాంద్రత కలిగిన రఫా ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా యుఎన్‌ఆర్‌డబ్ల్యూఏ (పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ) కంపౌండ్, మసీదులు, క్లినిక్స్, పాఠశాలలు వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల గుండా ఈ టన్నెల్‌ మార్గం వెళుతుందని ఐడీఎఫ్‌ వెల్లడించింది. దీని ద్వారా హమాస్ మానవ కవచాలను ఉపయోగించే వ్యూహాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa