బంగాళాఖాతంలో ఈ రోజు (నవంబర్ 22) సాయంత్రం లేదా రేపు ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా తెలియజేసింది. ఈ వ్యవస్థ వేగంగా బలపడుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో అంటే బుధవారం (నవంబర్ 26) నాటికి ఇది పూర్తిస్థాయి తుఫానుగా (Cyclonic Storm) రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అల్పపీడనం దక్షిణాది ఆందామాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటుందని, అక్కడి నుంచి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్-తమిళనాడు తీరం వైపు దూసుకొస్తుందని IMD అధికారులు వెల్లడించారు. దీని తీవ్రత, ఖచ్చితమైన ట్రాక్ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉన్నప్పటికీ, తీరప్రాంత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వ్యవస్థ ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు (శుక్రవారం) ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. రేపటి నుంచి ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు విస్తరిస్తాయని అంచనా.
మత్స్యకారులు ఈ మూడు రోజులు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాను ట్రాక్, తీవ్రతపై నిమిషానికో నవీకరణ వస్తుందని, ప్రజలు అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని IMD కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa