ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుళ్ల కుట్రలో వెలుగులోకి కొత్త కోణం.. 2023 నుంచి దాడులకు ప్లాన్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 07:55 PM

గతవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్రచేసినట్టు వెల్లడయ్యింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న కుట్రను దర్యాప్తు అధికారులు డీకోడ్ చేయడంతో నిందిత ఉగ్రవాది డాక్టర్ ముజామ్మిల్ షకీల్ 2023లో దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల కిందట నుంచే వ్యూహరచన చేసినట్టు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మహమ్మద్ నబీ సన్నిహితుడైన ముజామ్మిల్ వెల్లడించినట్టు పేర్కొన్నాయి.


 రెండేళ్లుగా పేలుళ్లకు సిద్ధమవుతున్నామని, ఈ సమయంలో పేలుడు పదార్థాలు, రిమోట్లు సహా ఇతర బాంబు తయారీ సామాగ్రిని సమకూర్చుకున్నట్టు అతడు బయటపెట్టినట్టు ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన యూరియా, అమ్మోనియం నైట్రేట్ సేకరించే పని అతడికి అప్పగించారని అన్నాయి. రూ.3 లక్షల విలువచేసే 26 క్వింటాళ్ల నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం రసాయనాలను హర్యానాలోని గురుగ్రామ్, నూహ్‌లో ముజామ్మిల్ కొనుగోలుచేసినట్టు తెలిసింది. నూహ్‌లోని ఇతర పేలుడు పదార్థాలు, ఫరీదాబాద్‌లోని రెండు వేర్వేరు మార్కెట్ల నుంచి ఎలక్ట్రానికి పరికరాలను కొన్నట్టు విచారణలో బయటపెట్టాడు. రసాయనాలను స్థిరమైన వాతావరణంలో రసాయనాలను నిల్వచేయడానికి డీప్ ఫ్రీజర్‌ను కూడా అతడు కొనడం గమనార్హం.


అతడి సహచరుడు డాక్టర్ ఉమర్ నబీ పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ఎరువులను ప్రాసెస్ చేయడం, రసాయనాలు, ఇతర పదార్థాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను తీసుకున్నాడు. బాంబుల తయారీకి అనుగుణంగా మార్చడానికి యూరియాను రుబ్బేందుకు ముజామ్మిల్ ఉపయోగించిన పిండి మిల్లును కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఇక, ఢిల్లీ పేలుడు కుట్రకు నిందితులే నిధులు సమకూర్చినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ మొత్తం రూ.26 లక్షలు నిధులు సేకరించి, ఈ మొత్తాన్ని ఉమర్‌కు అప్పగించారని, అతడు స్వయంగా రూ.2 లక్షలు ఇచ్చాడని తెలిపాయి. ముజామ్మిల్ రూ.5 లక్షలు, అదిల్ రధర్ రూ.8 లక్షలు, ముజఫర్ రదర్ రూ.6 లక్షలు, షహీన్ సయీద్ రూ.5 లక్షలు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ డబ్బుల కోసమే అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్, ముజ్మామిల్ మధ్య గొడవ జరిగినట్టు నిర్దారించారు. ఈ గొడవ తర్వాత ఉమర్ తన ఇకోస్పోర్ట్ కారును ముజ్మామిల్‌కు ఇచ్చేశాడు. ఢిల్లీ పేలుడు తర్వాత ఈ వాహనాన్ని ఫరీదాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్ వద్ద గుర్తించారు.


అదిల్ రదర్ లాకర్‌లో లభ్యమైన ఏకే-47 రైఫిల్‌ను రూ.6.5 లక్షలు కొన్నట్టు ముజ్మామిల్ ఒప్పుకున్నాడు. అలాగే, తమ హ్యాండ్లర్ల పేర్లను కూడా అతడు బయటపెట్టాడు. తనకు మన్సూర్, ఉమర్‌కు హషీమ్‌ హ్యాండ్లర్‌గా ఉన్నారని, ఈ ఇద్దరూ ఇబ్రహీమ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు పనిచేశారని దర్యాప్తు వర్గాలు వివరించాయి. ముజామ్మిల్, అదిల్, ముజాఫర్‌లు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)‌కు సంబంధించిన ఒకాసా ఆదేశాల మేరకు టర్కీకి వెళ్లారు. ప్లాన్‌లో అఫ్గనిస్తాన్‌‌కు వెళ్లాల్సి ఉండగా, దాదాపు వారం రోజుల వెయిట్ చేయించిన తర్వాత రద్దుచేసినట్టు వర్గాలు తెలిపాయి.


పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే ముందు ఇంటర్నెట్‌లో బాంబులు తయారీ వీడియోలు, సంబంధిత సమాచారాన్ని ఉమర్ పరిశీలించినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం.. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు అనేక ప్రాంతాల్లో పేలుళ్ల కోసం చేసిన కుట్రలను సూచిస్తున్నాయి. నిందితులు వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి పేలుళ్లు నిర్వహించాలనే ప్రణాళిక రచించినట్లు చెప్పాయి. ఈ కుట్రలో విదేశీ సంబంధాలు, దేశీయ మాడ్యుల్స్‌ బయటపడుతుండటంతో దర్యాప్తు సంస్థల లోతుగా దృష్టిసారించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa