ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్.. కేంద్రం ప్రయత్నాలపై పంజాబ్ ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:27 PM

చండీగఢ్ పరిపాలనా స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రాజ్యాంగ సవరణ ప్రతిపాదన పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంట్ బులిటెన్ ప్రకారం.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ సవరణ ద్వారా చండీగఢ్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్ 240 ప్రకారం.. రాష్ట్రపతికి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల శాంతి, పురోగతి, పాలన కోసం నేరుగా నిబంధనలను రూపొందించే అధికారం ఉంటుంది.


అయితే ప్రస్తుతం పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే ఈ చండీగఢ్ పరిపాలనా బాధ్యతలకు పంజాబ్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చండీగఢ్‌ను ఆర్టికల్ 240 కిందకు తీసుకురావడం వల్ల.. ఆ ప్రాంతంపై రాష్ట్రపతి నియంత్రణ పెరిగి, పంజాబ్ గవర్నర్ పాత్ర బలహీనపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


 కేంద్ర ప్రభుత్వం చండీగఢ్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జాబ్ రాజధానిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చండీగఢ్ ఎల్లప్పుడూ పంజాబ్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. చండీగఢ్ నిర్మాణానికి తమ గ్రామాలను ధ్వంసం చేశారని.. దానిపై హక్కు కేవలం పంజాబ్‌కు మాత్రమే ఉందని.. దీనిపై వెనక్కి తగ్గకుండా తాము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భగవంత్ మాన్ హెచ్చరించారు.


చండీగఢ్ విషయంలో కేంద్రం చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖండించారు. ఇది పంజాబ్ అస్తిత్వంపై దాడిగా ఆయన అభివర్ణించారు. పంజాబీలు ఎప్పుడూ నియంతృత్వానికి తలవంచలేదని.. చండీగఢ్ పంజాబ్‌కు చెందిందని.. అది అలాగే ఉంటుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.


ఇక చండీగఢ్ విషయంలో పంజాబ్‌లోని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు కూడా ఏకమై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. చండీగఢ్‌ను లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని పంజాబ్‌లోని బీజేపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. ఈ పంజాబ్ వ్యతిరేక బిల్లు.. సమాఖ్య వ్యవస్థపై స్పష్టమైన దాడి అని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. దీనిపై ప్రతి వేదికలో తాము పోరాటం చేస్తామని ప్రకటించారు. చండీగఢ్‌పై పంజాబ్ హక్కుతో రాజీపడటం కుదరదని సుఖ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa