ఇథియోపియాలోని హేలీ గబ్బీ అగ్నిపర్వతం భారీగా బద్దలై, లక్షల టన్నుల బూడిదను ఆకాశంలోకి విసిరేసింది. ఈ భయంకరమైన బూడిద మేఘం (యాష్ క్లౌడ్) గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా భారత ఉపఖండం వైపు దూసుకొచ్చింది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ మేఘం ఇప్పటికే భారతదేశం పైన ఉన్న గాలుల ద్వారా వ్యాపించడం మొదలుపెట్టింది. దీని ప్రభావం దేశంలోని ఉత్తర, పశ్చిమ భాగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మంగళవారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఆకాశం మసకగా కనిపిస్తోంది. ఈ బూడిద మేఘం ముందుగా రాజస్థాన్‌లో గుర్తించబడింది. ఉపగ్రహ చిత్రాల్లో 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ భారీ మేఘం స్పష్టంగా కనిపించింది. ఇది ఇప్పుడు హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వరకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ బూడిద మేఘం వల్ల గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఎన్-95 మాస్క్ ధరించడం తప్పనిసరని చెబుతున్నారు.
విమాన రాకపోకలపైనా ఈ బూడిద మేఘం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుల్లో దృశ్యమానత తగ్గడంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి, కొన్ని రద్దు కావడం లేదా డైవర్ట్ చేయడం జరుగుతోంది. రానున్న 48 గంటల్లో ఈ ప్రభావం మరింత ఉండవచ్చని విమానయాన అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచన చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa