ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 09:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఆమోదం తెలిపారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫార్సులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. మార్కాపురం, మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదం పొందాక అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో ఈ జిల్లా ఏర్పాటవుతోంది. రంపచోడవరం డివిజన్‌లోని రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఇందులో ఉంటాయి. చింతూరు డివిజన్‌లోని యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. సుమారు 3.49 లక్షల జనాభాతో రంపచోడవరం కేంద్రంగా ఈ గిరిజన జిల్లా రూపుదిద్దుకోనుంది.మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలోని 22 మండలాలను ఇందులో చేర్చారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు ఉంటాయి. కనిగిరి డివిజన్‌లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు ఈ జిల్లాలో భాగం కానున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.మదనపల్లె జిల్లా అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న పీలేరు, పాత మదనపల్లె రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాలను ఈ జిల్లాలో చేర్చారు. మదనపల్లె డివిజన్‌లో మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీఎం, బి.కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు ఉంటాయి. పీలేరు డివిజన్‌లో సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉంటాయి. ఈ జిల్లా జనాభా సుమారు 11.05 లక్షలుగా ఉండనుంది.కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు మూడు కొత్త జిల్లాలతో పాటు, రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లు రానున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి, పెద్దహరివనంను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరును "వాసవీ పెనుగొండ మండలం"గా మార్చనున్నారు.ఇతర ముఖ్యమైన మార్పులు మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు అనేక మండలాలను, నియోజకవర్గాలను వేర్వేరు డివిజన్లు, జిల్లాల్లోకి మార్చారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లో చేర్చనున్నారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ నుంచి పెద్దాపురం డివిజన్‌లోకి మార్చనున్నారు. ఈ పునర్విభజన ప్రక్రియలో భాగంగా 17 జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటుచేసుకోగా, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులూ లేవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa