ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్.. 5 కీలక మార్పులు

business |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 10:46 PM

దేశ ఆదాయ పన్ను చరిత్రలో అతిపెద్ద సంస్కరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఈ కొత్త చట్టం 1961 నాటి పాత చట్టం స్థానాన్ని భర్తీ చేయనుంది. ఆదాయపు పన్నుల సంబంధించి సామాన్య పన్ను చెల్లింపుదారుల కోసం పన్నుల ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, ఐటీఆర్ ఫారాలను సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాత చట్టంలోని చాలా అంశాల్లో మార్పులు చేశారు. పలు క్లిష్టమైన పదాలను తొలగించారు. ఈ క్రమంలో సామాన్య పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన ఐదు ప్రధాన మార్పులు తెలుసుకుందాం.


1. నిబంధనలు మరింత సులభం


ప్రస్తుతం ఉన్న 1961 చట్టంలో 819 సెక్షన్లు, సంక్లిష్టమైన నిబంధనలు ఉండడంతో సాధారణ పన్ను చెల్లింపుదారులకు అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉండేది. అయితే కొత్త చట్టంలో సెక్షన్లు తగ్గించారు. పన్నుల భాషను సైతం సరళతరం చేశారు. దీని వల్ల పన్ను చట్టాన్ని అర్థం చేసుకోవడానికి న్యాయపరమైన భాషపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పత్రాలు ఏ ఆదాయం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీగా ఉండనుంది.


2. కొత్త, సరళీకృత ఐటీఆర్ ఫారాలు


ఐటీఆర్ ఫారాల సంక్లిష్టత అనేది ట్యాక్స్ పేయర్లకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్యగా ఉండేది. కొత్త చట్టంతో పాటు సరళీకృత ఐటీఆర్ ఫారాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాదికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను జనవరి నెలలోనే విడుదల చేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం ఇటీవలే ప్రకటించింది.


ఐటీఆర్ ఫారాలు తగ్గనున్నాయి. అనవసరమైన షెడ్యూళ్లను తొలగిస్తారు. ఒకే సమాచారాన్ని పదేపదే నింపాల్సిన అవసరం ఉండదు. ముందుగా నింపి ఉంచే డేటా పరిధి విస్తరిస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ సులభమవుతుంది. దీంతో జీతం తీసుకునే ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లకు పన్ను దాఖలు ప్రక్రియ వేగంగా తక్కువ శ్రమతో కూడుకున్నదిగా మారుతుంది.


3. పన్ను సంవత్సరం సరళీకరణ


పన్ను చెల్లింపుదారులలో తరచుగా గందరగోళాన్ని సృష్టించే అంశం ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ సంవత్సరం. కొత్త చట్టంలో వీటిని మార్చారు. ఇకపై పన్ను సంవత్సరం అనేది తీసుకొచ్చారు. ఇకపై ఎలాంటి గందరగోళం ఉండదు. దీంతో మీ ఆదాయం ఏ సంవత్సరానిది? దానిపై పన్ను చెల్లించాల్సిన సంవత్సరం ఏది? మీరు రిటర్నులు దాఖలు చేయాల్సిన సంవత్సరం ఏది? ఈ మూడు అంశాలను ఒకే ఫ్రేమ్‌వర్క్ కింద సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల పన్ను లెక్కలు మరింత స్పష్టంగా, నేరుగా ఉంటాయి.


4. పన్ను శ్లాబుల్లో మార్పులు


సాధారణంగా కొత్త చట్టం వస్తే, పన్ను రేట్లు మారుతాయని చాలా మంది భావిస్తారు. అయితే, ఈసారి ప్రభుత్వం దృష్టి రేట్లను మార్చడంపై కాకుండా నిబంధనలను సరళతరం చేయడంపై ఉంది. అంటే, పన్ను శ్లాబులు, సర్‌చార్జీలు లేదా సెస్ వంటి వాటిలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇది మధ్యతరగతి, జీతం తీసుకునే ఉద్యోగులకు ఊహించని పన్ను భారం ఉండదనే పెద్ద ఉపశమనం.


5. నోటీసులు, వివాదాల తగ్గింపుపై దృష్టి


అస్పష్టమైన, సంక్లిష్టమైన సెక్షన్ల కారణంగా తరచుగా అనవసరమైన నోటీసులు, వివాదాలు తలెత్తేవి. కొత్త చట్టం అస్పష్టమైన నిబంధనలను తొలగిస్తుంది, ఫేస్‌లెస్ ప్రక్రియను బలోపేతం చేస్తుంది. నోటీసు వ్యవస్థను మరింత స్పష్టంగా, డిజిటల్‌గా మారుస్తుంది. తప్పుడు అపార్థాల ఆధారంగా వచ్చే నోటీసులు, అనవసరమైన విచారణలు, సుదీర్ఘ పన్ను వివాదాలు తగ్గుతాయి. దీని ద్వారా పన్ను చెల్లింపుదారుల్లో ఒత్తిడి తగ్గి, విశ్వాసం పెరుగుతుంది.


ఏప్రిల్ 1 కేవలం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు ఇది భారతదేశంలో కొత్త పన్ను శకానికి నాందిగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 63 ఏళ్ల నాటి చట్టానికి ముగింపు పలుకుతూ సరళమైన ఫ్రేమ్‌వర్క్, ఫారాల్లో మార్పులు, సరళమైన భాష వంటి అంశాలు రాబోయే సంవత్సరాలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొంది. ఈ మార్పులన్నీ సామాన్య పన్ను చెల్లింపుదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa