అమెరికాలో ఉద్యోగం, స్థిర నివాసం ఆశించే భారతీయులు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు, హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు వంటి కారణాలతో చాలా మంది ప్రత్యామ్నాయ వీసాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అసాధారణ ప్రతిభావంతులకు జారీ చేసే ఈబీ-1ఏ వీసాకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది.యూఎస్ ఇమిగ్రేషన్ సేవల సంస్థ 'బౌండ్‌లెస్ ఇమిగ్రేషన్' విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో ఈబీ-1ఏ వీసా కోసం ఏకంగా 7,338 దరఖాస్తులు అందాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 56 శాతం అధికం. ఈ దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం మంది భారతీయులేనని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.సైన్స్, విద్య, కళలు, వ్యాపారం వంటి రంగాల్లో విశేషమైన నైపుణ్యం, అసాధారణ ప్రతిభ కలిగిన వారు ఈబీ-1ఏ వీసాకు అర్హులు. నిర్దేశించిన పది ప్రమాణాల్లో కనీసం మూడు పూర్తి చేసిన వారికి ఈ వీసా లభిస్తుంది. హెచ్-1బీ వీసాతో పోలిస్తే ఈబీ-1ఏ వీసా ద్వారా నేరుగా అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం ఉండటంతో భారతీయులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. కఠినతరమవుతున్న హెచ్-1బీ నిబంధనల నేపథ్యంలో, తమ ప్రతిభ ఆధారంగా అమెరికా వెళ్లేందుకు ఇది సులువైన మార్గంగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa