ఓ మంత్రి ముందు ఐటెం గర్ల్స్ డ్యాన్సులు చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార డీఎంకేను ఇరకాటంలోకి నెట్టింది. శివగంగ జిల్లాలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు మంత్రి పెరియకరుప్పన్ ఎదుట ఓ మహిళ డ్యాన్స్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. తమిళ సంస్కృతిని, మహిళల గౌరవాన్ని నాశనం చేస్తున్నారని మండిపడింది. మరో విపక్షం అన్నాడీఎంకే సైతం విమర్శలు గుప్పించింది.
‘‘కేవలం వినోదం, విందుల కోసమే ప్రభుత్వ పదవులు తీసుకున్నారా? ఎలాంటి అర్హతలు లేకుండా వారసత్వంగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజును సీనియర్ మంత్రులు జరపడం దాసత్వానికి పరాకాష్ట..ఈ వేడుకలను అశ్లీల ప్రదర్శనగా మార్చి, పొగడటం ఎంతటి అవమానకరం.. ఆత్మగౌరవం, హేతుబద్ధమైన ఆలోచన గురించి మాట్లాడే అర్హత వీరికి ఉందా? మహిళలను పిలిపించి, అర్దనగ్నంగా డ్యాన్సులు చేయించి, చప్పట్లు కొట్టించి ఆనందించే డీఎంకే నాయకులకు మహిళలు తమ గోడును ఎలా చెప్పుకోగలరు? తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతిభద్రతల సమస్యలు, అవినీతి, అక్రమాలతో నిండిపోయింది.. ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రుల వరకు అందరూ ఇలాంటి వినోదాలకే ప్రాధాన్యత ఇస్తుండటం సిగ్గుచేటు కాదా? ఈ నాట్యం చేసే కాళ్లు ఎప్పుడైనా ఆగుతాయా?’’ అని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
అయితే, ఈ ఆరోపణలను డీఎంకే వర్గాలు ఖండించాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్ఠాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆ మహిళలను మంత్రి డ్యాన్స్ చేయమన్నారని కోరినట్టు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నాయి. ఆమె తనంతట తానుగా స్టేజ్ మీద నుంచి వచ్చి, మంత్రి ముందు డ్యాన్స్ చేశారని ఆ పార్టీ వర్గాలు చెప్పారు. అంతేకాదు, అన్నాడీఎంకే సైతం డ్యాన్స్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఇది ఎన్నికైన డీఎంకే ప్రజాప్రతినిధుల మనస్తత్వానికి, ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తుంది.. మహిళలను గౌరవించే విషయంలో పెరియకురుప్పన్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు.. పదేళ్ల కిందట ఆయన అనైతిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.. ఎన్నికల సమయంలో అది వెలుగులోకి వచ్చింది.. ఇవి డీఎంకే ప్రాధాన్యతను బహిర్గతం చేస్తాయి.. మహిళలను వారు గౌరవంతో ఎందుకు చూడరో మరోసారి నిరూపిస్తున్నాయి’’ అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa