ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్నాలతో కమర్షియల్‌గా వివాహం.. సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 07:33 PM

వరకట్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ వరకట్నంతో కమర్షియల్ అంశంగా మారిపోయిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరస్పర విశ్వాసం, సహవాసం, నమ్మకం, గౌరవాలపై నిర్మితమైన ఈ ఆదర్శ వ్యవస్థ ఇటీవలి కాలంలో వాణిజ్య లావాదేవీగా మారిపోవడం విచారకరమని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌. ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం పేర్కొంది. పెళ్లైన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. భర్త విపరీత పోకడ, నేర తీవ్రత, బాధితురాలి వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని మండిపడింది.


ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. ‘‘వరకట్న మరణం కేవలం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజం మొత్తంపై జరిగిన నేరం. స్వచ్ఛంద కానుకలు, బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను ప్రదర్శించుకునే ప్రయత్నం.. వస్తు వ్యామోహాన్ని తృప్తిపరిచే తాపత్రయం. వరకట్నం సామాజిక దురాచారం. వివాహ పవిత్రతను ఇది భ్రష్టుపట్టించి, మహిళల్ని అణచివేతకు గురిచేస్తోంది. మరింత క్రూరంగా మారి నవ వధువుల అకాల మరణానికి కారణమవుతుంది. కేవలం వ్యక్తిగత విషాదమే కాదు.. సమాజ ఉమ్మడి అంతరాత్మకు అవమానం.


ఎటువంటి తప్పు చేయకున్నా గొంతెమ్మ కోరికలు తీర్చలేని ఒకే ఒక్క కారణంతో అత్తింటిలో కోడలి జీవితం బలైపోతోంది.. మానవ గౌరవ మూలాలపై ఇది ఘోరమైన నేరం. సమానత్వం, గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించే రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21 కల్పించిన హక్కులను ఇది హరిస్తోంది. సమాజ కూర్పును క్షీణింపజేసి, నాగరిక సమాజ పునాదుల్ని బలహీనపరుస్తోంది. న్యాయవ్యవస్థ ఇలాంటివాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్టువుతుంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలించినట్లవుతుంది.. కాబట్టి చట్టం నమ్మకం, గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయవ్యవస్థ స్పందన బలంగా ఉండాలి.


ఈ కేసులో న్యాయంతో పాటు వరకట్న దురాచారాలను చట్టం, సమాజం అంగీకరించవని నిర్ద్వంద్వంగా సందేశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆందోళనకర రీతిలో వరకట్న మరణాలు పెరుగుతున్న తరుణంలో న్యాయసమీక్ష కఠినంగా ఉండాలి. నేరాలకు పాల్పడినవారిని స్వేచ్ఛగా వదిలేస్తే సెక్షన్ 304బీ, 498ఏ లక్ష్యమే నీరుగారిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa