ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పరిచయమే ఉగ్రవాదంవైపు,,,,ఢిల్లీ పేలుడు నిందిత డాక్టర్ లవ్ స్టోరీ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 07:37 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబరు 10న జరిగిన పేలుడు కేసులో కీలక నిందితురాలు 46 ఏళ్ల డాక్టర్ షాహీన్ సయీద్.. ఒకప్పుడు వైద్యురాలిగా, ఇద్దరు భర్తలతో విడాకులు తీసుకున్న మహిళగా, ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలలోకి దిగింది. సెప్టెంబర్ 2023లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను వివాహం చేసుకున్న తర్వాతే ఆమె తీవ్రవాద మార్గంలోకి వెళ్లిందని సమాచారం. లక్నోలో మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన షాహీన్ సయీద్. ప్రతిభ కలిగిన విద్యార్థిగా గుర్తింపు పొందింది. అలహాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ తర్వాత ఫార్మకాలజీ స్పెషలైజేషన్‌తో ఎండీ పూర్తిచేశారు. ఆమె తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి.


ఇక, 2003లో ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ జఫర్ హయాత్‌ను షాహీన్ వివాహం చేసుకోగా.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, విదేశాలకు వెళ్లాలనే కోరిక విడాకులకు కారణాలని డాక్టర్ హయాత్ తెలిపారు. ఆస్ట్రేలియా లేదా ఐరోపా వెళ్లిపోదామని, ఇక్కడ కంటే మంచి జీవితం గడపొచ్చని ఆమె అంటుండేదని, ఇక్కడే బాగుంది కదా అని తాను తిరస్కరించినట్టు హయాత్ చెప్పారు.


‘‘మేము 2003 నవంబర్‌లో వివాహం చేసుకున్నాం.. ఇద్దరం వేర్వేరుగా మెడికల్ విద్యను సాగించాం.. నేను ఆమెకు సీనియర్‌ని. మా విడాకులు 2012 చివరిలో జరిగాయి. ఆమె మనసులో ఏముందో నాకు తెలియదు. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఆమె ప్రేమగా, జాగ్రత్తగా ఉండే వ్యక్తి. ఆమె ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆమె తన కుటుంబానికి, పిల్లలకు చాలా దగ్గరగా ఉండేది, వారిని అమితంగా ప్రేమించేది, వారి చదువులను చూసుకునేది’’ అని డాక్టర్ హయాత్ చెప్పారు.


అయితే, విడాకుల తర్వాత షాహీన్ ఒంటరితనాన్ని అనుభవించింది. తాను పనిచేస్తున్న GSVM మెడికల్ కాలేజీ నుంచి అకస్మాత్తుగా తప్పుకుంది. ఎనిమిదేళ్లపాటు ఆమె ఆచూకీ తెలియలేదు, 2021లో ఆమె ఉద్యోగం రద్దయ్యింది.. తర్వాత ఘజియాబాద్‌లో టెక్స్‌టైల్ వ్యాపారం చేసే వ్యక్తిని వివాహం చేసుకుంది, కానీ ఆ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.


ఆ తర్వాత, కశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజామ్మిల్ షకీల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. దీంతో సెప్టెంబర్ 2023లో ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. షకీల్‌తో పెళ్లి ఆమె జీవితాన్ని ఉగ్రవాదంవైపు నడిపించింది. ఈ సమయంలోనే తీవ్రవాద గ్రూపులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. జైషే మొహమ్మద్ మహిళా విభాగం 'జమాత్ ఉల్-మోమినాత్' సభ్యులు ఆమెకు తీవ్రవాద సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.


వైద్య వృత్తిని ఉపయోగించుకుని, షాహీన్ జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా మధ్య ప్రయాణిస్తూ నిధుల బదిలీ, సమాచారం చేరవేతలో సహాయపడింది. పాకిస్థాన్‌లో ఉన్న జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని 'జమాత్ ఉల్-మోమినాత్' ఇండియా విభాగానికి చీఫ్‌గా ఆమె బాధ్యతలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి.


షాహీన్ సోదరుడు మహమ్మద్ షోయబ్ ఆమెతో మేము గత నాలుగేళ్లుగా మాట్లాడటం లేదని, ఇలాంటి దేశద్రోహ చర్యల్లో పాల్గొంటుందంటే నమ్మశక్యం కావడం లేదు అన్నాడు. ఆమె తండ్రి కూడా తన కుమార్తె పనికి షాకయ్యారు. ఈ కేసులో షాహీన్, ఆమె సహచరులు ముజమ్మిల్ షకీల్, అదీల్ అహ్మద్ రాథర్ అరెస్ట్ అయ్యారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో 15 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ కారణమని తేలింది. ఉమర్ కూడా అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన కశ్మీరీ డాక్టరే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa