రష్యా మిత్రదేశమైన బెలారస్ నుంచి వస్తున్న వందలాది వాతావరణ బెలూన్ల కారణంగా నాటో సభ్య దేశమైన లిథువేనియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ బెలూన్లు లిథువేనియా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని రన్‌వేల పైకి వచ్చేలా ప్రయోగిస్తున్నారని.. ఇది తమ దేశంపై జరుగుతున్న "నీచమైన హైబ్రిడ్ దాడి" అని లిథువేనియా విదేశాంగ శాఖ ఉప మంత్రి తౌరిమస్ వాలీస్ తీవ్రంగా ఖండించారు.
అత్యంత తీవ్రమైన సంఘటనగా భావిస్తున్న ఇటీవలి ఘటనలో.. శనివారం రాత్రి విల్నియస్ విమానాశ్రయంలో కార్యకలాపాలు 11 గంటలపాటు నిలిచిపోయాయి. బెలారస్‌లోని అడవుల నుంచి కనీసం 60 బెలూన్లు ప్రయోగించబడ్డాయని.. వాటిలో 40 బెలూన్లు వైమానిక భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతాలకు చేరుకున్నాయని లిథువేనియా అధికారులు తెలిపారు. ఈ బెలూన్లు నిర్దిష్ట సమయ వ్యవధిలో.. రన్‌వేలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించబడుతున్నాయని విమానయాన అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు బెలారస్ ప్రభుత్వం లిథువేనియాపై ఎదురుదాడికి దిగింది. లిథువేనియా తమ గగనతలంలోకి డ్రోన్‌ను పంపి గూఢచర్యానికి, ఉగ్రవాద సామగ్రిని పంపడానికి ప్రయత్నించిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై బెలారస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ లిథువేనియా ఛార్జ్ డి అఫైర్స్ ఎరికస్ విల్కానెకాస్‌కు సమన్లు జారీ చేసింది. తమ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని బెలారస్ హెచ్చరించింది. అలాగే ఈ బెలూన్ల వ్యవహారంలో తమ ప్రమేయం నిరూపించబడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అధ్యక్షుడు లుకషెంకో గతంలో అన్నారు.
ఈ డ్రోన్ ఘటనలో లిథువేనియాకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి సమాచారం అందలేదని ప్రధాని ఇంగా రుగినియెనె తెలిపారు. అక్టోబర్‌లో బెలూన్ల కారణంగా లిథువేనియా సరిహద్దులను మూసివేసింది. దీనికి ప్రతీకారంగా బెలారస్ 1000కు పైగా లిథువేనియా కార్గో ట్రక్కులను నిలిపివేసింది. లాజిస్టిక్స్ కంపెనీల ఒత్తిడితో సరిహద్దును తిరిగి తెరవాల్సి వచ్చింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి లిథువేనియా 1 మిలియన్ యూరోలను కేటాయించింది. దీనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఇంటిలిజెంట్ ఎయిర్‌స్పేస్ సెక్యూరిటీ సిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నారు. ఇది లక్ష్యాలను గుర్తించి, బెలూన్లను సురక్షితంగా పేల్చివేయడానికి అధిక శక్తి గల లేజర్‌ను ఉపయోగిస్తుంది.
రాత్రి విమానాలను కౌనాస్ వంటి ఇతర విమానాశ్రయాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రధాని సలహాదారు తెలిపారు. అవసరం అయితే సరిహద్దును మూసివేస్తామని ప్రధాని తెలిపారు. కానీ దానిని వ్యూహాత్మక భాగస్వాములతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లకు పైగా కొనసాగుతున్న తరుణంలో రష్యా మిత్ర దేశమైన బెలారస్, నాటో సభ్య దేశమైన లిథువేనియాల మధ్య ఈ ఉద్రిక్తతలు ఐరోపా ఖండం మొత్తాన్ని హై అలర్ట్‌కు గురిచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa