ట్రెండింగ్
Epaper    English    தமிழ்

80 వేల మంది చూస్తుండగా.. తుపాకీతో కాల్చి బహిరంగంగా ఒక వ్యక్తికి మరణశిక్ష అమలు చేసిన 13 ఏళ్ల బాలుడు

international |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 09:01 PM

అది ఒక భారీ స్టేడియం.. అక్కడ సుమారు 80 వేల మందికి పైగా జనం గుమికూడారు. అంత మంది చూస్తుండగా.. ఓ 13 ఏళ్ల బాలుడు.. తన ఎదురుగా ఉన్న వ్యక్తి గుండెల్లోకి గురి చూసి కాల్పులు జరిపాడు. తూటా దెబ్బకు ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి చుట్టూ ఉన్న జనాలు భక్తితో ఆర్తనాదాలు చేశారు. మరి కొందరు హాహాకారాలు చేశారు. ఏది ఏమైనా పదమూడేళ్ల పిల్లాడి చేతికి గన్ ఇవ్వడమే తప్పు అనుకుంటే.. ఆ బాలుడి చేతనే చంపించడం మరింత దారుణం. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. ఇంకెక్కడ తాలిబన్ల పాలన కొనసాగుతున్న ఆఫ్గానిస్థాన్‌లో.


తూర్పు ఆఫ్గానిస్థాన్‌లోని ఒక స్టేడియంలో ఈ బహిరంగ మరణ శిక్ష అమలు చేశారు. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు 'అమానవీయం' అని ఖండించారు. వివరాల ప్రకారం.. మంగల్‌ అనే వ్యక్తి తూర్పు ఆఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్‌లో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేశాడు. అందులో తొమ్మిది మంది చిన్నారులున్నారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. బాధిత కుటుంబానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు.. నిందితుడైన మంగల్‌ను తుపాకీతో కాల్చి మరణ శిక్షను అమలుపర్చాడు.


ఈ శిక్షను చూడటానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ మరణశిక్షను కోర్టు 'ప్రతీకార శిక్ష'గా అభివర్ణించింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. బాధితుల కుటుంబాలకు క్షమాభిక్ష, శాంతి ప్రతిపాదనలు చేశామని, కానీ వారు తిరస్కరించారని కోర్టు పేర్కొంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ఈ శిక్ష భవిష్యత్తులో నేరాలు చేయకుండా అడ్డుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇకపై ఎవరూ ఎవరినీ చంపడానికి సాహసించరు అని అన్నాడు. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలని అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేశారని తెలిపాడు.


నివేదికల ప్రకారం 2025 జనవరిలో బాధిత కుటుంబంపై కొందరు దుండగులు దాడి చేశారు. వీరిలో మంగల్ అనే నిందితుడు ఉన్నాడు. ఈ దాడిలో చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలతో సహా మరో పది మంది మరణించారు. దాడిలో పాల్గొన్న మంగల్‌కి బహిరంగ మరణశిక్ష విధించారు. అయితే ఈ తీర్పును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నివేదికకర్త రిచర్డ్ బెన్నెట్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అత్యంత క్రూరమైన అమానవీయ అసాధారణ శిక్ష. ఈ తీర్పు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని అన్నారు.


తాలిబన్ల పాలనలో బహిరంగ మరణశిక్షలు సర్వసాధారణం. గతంలో 1996-2001 వరకు కొనసాగిన తాలిబన్ల పాలనలో తరచుగా బహిరంగ మరణశిక్షలు విధించేవారు. అప్పట్లో క్రీడా మైదానాల్లోనే ఈ శిక్షలు అమలు చేసేవారు. 2021లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఇది 12వ బహిరంగ మరణశిక్ష. దీనికి ముందు అక్టోబర్‌లో బాధిస్‌లో 11వ కేసు నమోదైంది.


ఇంతకుముందు ఏప్రిల్‌లో, అధికారులు మూడు వేర్వేరు ప్రావిన్సుల్లో నలుగురు వ్యక్తులకు ఒకేసారి మరణశిక్ష విధించారు. దొంగతనం, వ్యభిచారం, మద్యం సేవించడం వంటి నేరాలకు తాలిబన్లు ఇప్పటికీ కొరడాలతో కొట్టడం వంటి శారీరక శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే ఈ బహిరంగ మరణశిక్షలకు కందహార్‌లో ఉన్న తాలిబన్ల సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదం తప్పనిసరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa