ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరాల బలహీనత తగ్గించే ఆసనాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 11:51 PM

నరాలు బలహీనపడటం అనేది ఏ వయసు వారికైనా ఇబ్బంది కలిగించే సమస్య. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, విటమిన్ B12, విటమిన్ D లోపాలు, అధిక ఒత్తిడి, వృద్ధాప్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించడం వంటి అనేక కారణాలు నరాల బలహీనతకు దోహదం చేస్తాయి.


డయాబెటిస్ కూడా నరాల్ని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా డయాబెటిక్ రెటినోపతి ప్రమాదాన్ని పెంచుతుంది. థైరాయిడ్, రక్తహీనత, డీహైడ్రేషన్ వంటి ఇతర పరిస్థితులు కూడా నరాల బలహనతకు కారణమవుతాయి.


​నరాలు బలహీనత వల్ల జలదరింపు, కండరాల్లో నొప్పి, నడుస్తున్నప్పుడు సౌకర్యం, దీర్ఘకాలిక వెన్ను నొప్పి, మోకాలి నొప్పి, కీళ్ల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యల్ని తగ్గించడంతో పాటు నరాల బలంగా మార్చడంలో యోగా సాయపడుతుంది. నరాల పనితీరును మెరుగుపర్చడంలో యోగా సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. నరాల బలహీనత అధిగమించే ఆ ఆసనాలేంటో ఇప్పుడు చుద్దాం.


భుజంగాసనం


​భుజంగాసనం వెన్నెముకను బలపరుస్తుంది. నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నరాలు స్ట్రాంగ్‌గా మార్చడంలో సాయపడుతుంది. ఈ ఆసనం చేయడం కోసం ముందుగా పొట్ట మీద పడుకుని.. చేతుల్ని ఛాతీ దగ్గర ఉంచండి. గాలి పీలుస్తూ ఛాతీ భాగాన్ని పైకెత్తి తలను వెనుకకు ఉంచండి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి ఆపై గాలి వదులుతూ తిరిగి రండి.


వజ్రాసనం


వజ్రాసనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. నరాలకు తగిన విశ్రాంతినిస్తుంది. ఈ ఆసనం మనసును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నరాల బలహీనతతో బాధపడేవారు వజ్రాసనాన్ని రెగ్యులర్‌గా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆసనం వేయడం కోసం మోకాళ్లపై కూర్చుని పిరుదుల్ని మడమల మీద ఉంచండి. మీ చేతుల్ని తొడలపై ఉంచి నిటారుగా కూర్చోండి. ఈ స్థితిలో 5 నుంచి 10 నిమిషాలు ఉండండి.


వంతెన భంగిమ


బ్రిడ్జ్ పోజ్ లేదా వంతెన భంగిమ వెన్నెముక, నరాల్ని బలపేతం చేయడానికి సాయపడుతుంది. ఈ ఆసనం థైరాయిడ్ గ్రంథిని సక్రియం చేస్తుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల నరాలు బలంగా మారతాయి. ఈ ఆసనం వేయడానికి ముందుగా వీపు మీద పడుకుని మీ మోకాళ్ళను వంచండి. మీ చేతుల్ని శరీరానికి దగ్గరగా ఉంచి శ్వాస తీసుకుంటూ తుంటిని పైకి లేపండి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి.. ఆపై గాలి వదులుతూ తిరిగి రండి.


శవాసనం


శవాసనం మొత్తం శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడానికి సాయపడుతుంది. ఈ ఆసనం ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా నరాల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఈ ఆసనం వేయడం చాలా సులభం. మీ వీపు మీద పడుకుని.. చేతుల్ని శరీరం నుంచి కొంచెం దూరంగా ఉంచండి. కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకోండి. ఈ స్థితిలో 10-15 నిమిషాలు ఉంచండి.


బాలాసనం


కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, నాడీ వ్యవస్థను సడలించడానికి బాలసనం మంచి ఆప్షన్. ఈ ఆసనం వీపు, మెడ, భుజాల్లో ఉద్రిక్తత నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ యోగా భంగిమను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల అనేక మానసిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా యోగా మ్యాట్ మీద మోకాళ్ళపై కూర్చోని.. చేతుల్ని నేలపై ఉంచండి. నుదురు నేలకు తగిలేలా ముందుకు వంగండి. చేతులు తల మీదుగా శరీరానికి పక్క చాపుకోండి. శ్వాస మీద ధ్యాస ఉంచి.. ఈ భంగిమలో ముప్పై సెకన్లు ఉండాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa