కూటమిలోని మూడు పార్టీల నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి మూలమని, ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్ల పాటు కొనసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాయకుల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌లు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే, కూటమి ప్రభుత్వానికి ఇంతటి ప్రజాబలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తేలేకపోతే మన పదవులన్నీ నిష్ప్రయోజనమే అని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు ప్రారంభించామని వివరించారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని గుర్తుచేశారు.ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు పదోన్నతి విలువ తెలుసు. అందుకే ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, కేవలం అర్హత ఆధారంగానే ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు.కూటమిలోని మూడు పార్టీలకు విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీ రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు అనే ఉమ్మడి లక్ష్యంతో అందరం ఒక గొడుగు కిందకు చేరామని పవన్ అన్నారు.మన మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, కమ్యూనికేషన్ గ్యాప్‌లు సహజం. కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయి. చిన్నగా మొదలైన మన కూటమి, ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బలమైన శక్తిగా నిలిచింది. మన ఐక్యత వల్లే నామినేటెడ్ పదవులు ఇవ్వగలుగుతున్నాం. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు శ్రమిస్తే రాష్ట్రానికి సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటివరకు దొరికింది కేవలం 10 శాతం సంపదే. దాని విలువే వేల కోట్లు ఉంటే, ఇక దొరకని సంపద విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి అవినీతిని అరికట్టి, బలహీనుల గొంతుకగా మనం నిలవాలి" అని పిలుపునిచ్చారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునే ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమని గత పాలకులు బెదిరించారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను భయపెట్టి ఏకగ్రీవాలు చేయాలని చూశారని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన కార్యకర్తలు ప్రాణాలకు తెగించి నిలబడ్డారని అభినందించారు.సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడమే జనసేన లక్ష్యం. కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని గౌరవిస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్‌సభ నియోజకవర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం" అని హామీ ఇచ్చారు.అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 'స్వచ్ఛరథాల'ను పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తెప్పించిన ఈ వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, అరణి శ్రీనివాసులు, కె. మురళీమోహన్, అరవ శ్రీధర్, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa