అందమైన ముఖం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, తిండి అలవాట్లు కారణంగా ఎన్నో చర్మ సమస్యలు వస్తున్నాయి. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు, పిగ్మేంటేషన్, పొడి బారడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. ముఖం తన మెరుపును కోల్పోతుంది.
దీంతో ఈ సమస్యల్ని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్, క్రీములు వాడతారు. మచ్చల్లేని, మెరిసే చర్మం కోసం వీటిని ఉపయోగిస్తారు. అయితే, వీటిలో ఉండే రసాయన కంటెంట్ కారణంగా.. చర్మంపై దద్దుర్లు, మంట వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఇలాంటి సమయాల్లో ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలు సరైన పరిష్కారం చూపుతాయి. ఇంట్లో దొరికే బియ్యం పిండి మచ్చల్లేని మెరిసే చర్మానికి బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. బియ్యం పిండిని ముఖానికి వాడటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నల్ల మచ్చలతో పాటు మొటిమలు తగ్గేందుకు బియ్యం పిండిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
బియ్యం పిండిలో చర్మానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. బియ్యం పిండిలో విటమిన్ బి, పెరులిక్ యాసిడ్, అల్లంటోయిన్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు లోతుగా చొచ్చుకుపోయి చనిపోయిన మృతకణాలతో పాటు మలినాల్ని తొలగిస్తాయి.
చర్మాన్ని బాగు చేయడంలో సాయపడతాయి. ఇవి మచ్చల్ని తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సాయపడతాయి. మచ్చలేని, మెరిసే చర్మం కోసం బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్‌తో బియ్యం పిండి
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఉన్న ఎరుపు, మచ్చల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇక, చర్మాన్ని తాజాగా, చల్లగా, మెరిసేలా ఉంచడానికి బియ్యం పిండిని రోజ్ వాటర్‌తో కలిపి ఉపయోగించవచ్చు.
ఇందుకోసం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండికి రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
పచ్చి పాలతో బియ్యం పిండి
పచ్చి పాలలో లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి. చర్మానికి లోపల నుంచి సహజంగా శుభ్రపరుస్తాయి. మీరు మచ్చలు, టానింగ్‌తో బాధపడుతుంటే బియ్యం పిండితో పచ్చి పాలను ఉపయోగించవచ్చు.
పేస్ట్ సిద్ధం చేయడానికి.. 2 టీస్పూన్ల బియ్యం పిండిని రెండు టీస్పూన్ల పచ్చి పాలతో కలపండి. ఈ పేస్ట్‌ను స్క్రబ్‌గా అప్లై చేసి ముఖంపై రుద్దండి. అలాగే, 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
మొటిమలకు ఎలా వాడాలి?
ఈ రోజుల్లో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా అనేక ప్రయత్నాలు ప్రయత్నించి విఫలమైంటే.. ఈ బియ్యం పిండి చిట్కా బాగా పనికొస్తుంది.
ఇందుకోసం రెండు టీస్పూన్ల బియ్యం పిండిని.. 2 టీ స్పూన్ల కలబంద జెల్‌తో కలపండి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఇది మొటిమల్ని తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ చేస్తుంది.
నిమ్మరసంతో బియ్యం పిండి
నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి నల్ల మచ్చల్ని తగ్గించడంతో పాటు ముఖాన్ని క్లీన్ చేయడంలో సాయపడతాయి. ఇందుకోసం ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని.. రెండు టీ స్పూన్ల బియ్యం పిండితో కలపండి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. అరగంట పాటు అలాగే ఉంచి చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇది చర్మానికి తక్షణ మెరుపును అందిస్తుంది. అంతేకాకుండా నల్ల మచ్చల్ని తగ్గించడంలో సాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa