గోవా నుంచి ఢిల్లీకి వెళ్తోన్న విమానంలో అమెరికాకు చెందిన మహిళ అస్వస్థతకు గురయ్యారు. అదే విమానంలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. దీంతో ఆ మహిళా నేతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి తాజాగా స్పందిస్తూ. . సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే... కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే మహిళ శనివారం గోవా నుంచి ఢిల్లీకి వెళ్తోన్న విమానం ఎక్కారు. గోవా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.
అదే విమానంలో ఉన్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రెటరీ డాక్టర్ అంజలి నింబాల్కర్ తక్షణమే స్పందించి ఆమెకు సీపీఆర్ చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడ్డారు. అంతటితో అలాగే వదిలేయకుండా దాదాపు గంటన్నర పాటు ఆమె పక్కనే కూర్చుని ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ.. చికిత్స అందించారు. చివరకు విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ మహిళను చికిత్స కోసం విమాన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్ అంజలిపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్ (ట్విట్టర్)లో డాక్టర్ నింబాల్కర్ ఫోటోను షేర్ చేస్తూ.. ఆమె సేవా తత్పరత తనను కదిలించిందని ప్రశంసించారు. అంజలి సమయస్ఫూర్తి, సహృదయతను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని కొనియాడారు. సరైన సమయానికి సీపీఆర్ చేసి, అమూల్యమైన ప్రాణాన్ని కాపాడారని శ్లాఘించారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూ వైద్య వృత్తికి కొన్నాళ్లుగా దూరమైనప్పటికీ ఈ ఉదంతంతో డాక్టర్ అంజలి నిబద్ధత స్పష్టమైందని అన్నారు.
‘‘ఆమెలోని డాక్టర్ ఒక్క క్షణం ఆలోచించకుండా స్పందించింది.. ఈ నిస్వార్థ చర్య వృత్తిపరమైన నైపుణ్యాన్ని మాత్రమే కాదు, తోటివారి పట్ల ఉన్న మానవత్వం, సేవాభావం, బాధ్యతను కూడా ప్రతిబింబిస్తుంది... అధికారంలో ఉన్నా లేకపోయినా, డాక్టర్ అంజలి నింబాల్కర్ లాంటి నాయకులు నిజమైన ప్రజాసేవకు ఉదాహరణలు. ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడూ సహాయానికి సిద్ధంగా ఉండటం ఇదే నిజమైన నాయకత్వానికి అర్థమని ఆమె చర్య మనకు గుర్తు చేస్తుంది. దేవుడు ఆమెకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అవసర సమయంలో మరెన్నో ప్రాణాలను కాపాడుతూ, జీవితాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
అటు, కర్ణాటక కాంగ్రెస్ సైతం ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రజాసేవలో అద్భుత మానవత్వం, ధైర్యాన్ని ఆమె కనబరిచారని కీర్తించింది. క్లిష్ట సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపారని, ప్రజాసేవకు అధికారం, హోదాలతో సంబంధం లేదని నిరూపించారని పేర్కొంది. కాంగ్రెస్ విలువలకు ఆమె చర్య ప్రతిబింబంగా నిలిచిందని ప్రశంసించింది. మరోవైపు, సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నారు. డాక్టర్ అంజలి 2018 ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, 2023 కర్ణాటక ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa