మన దేశంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఏది అంటే ఠక్కున కర్ణాటక రాజధాని బెంగళూరు గుర్తుకు వస్తుంది. బెంగళూరు ట్రాఫిక్‌కు సంబంధించి.. అనేక వీడియోలు, వార్తలు మనం నిత్యం మీడియా, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. దేశానికి ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరంలో.. కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ మధ్య పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ట్రాఫిక్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
బెంగళూరులోని హెబ్బాల్-మేఖ్రీ సర్కిల్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి.. కర్ణాటక మంత్రివర్గం రూ. 2,215 కోట్లతో మూడు లేన్ల ట్విన్ టన్నెల్ (కట్-అండ్-కవర్ పద్ధతి) ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గతంలో రద్దు చేసిన స్టీల్ ఫ్లై ఓవర్ తర్వాత ఇదే అతిపెద్ద ప్రాజెక్టు కావడం గమనార్హం. అయితే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ సొరంగం ప్రాజెక్ట్ ఖరీదైనదని.. అంతర్గత అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గతంలో స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్‌ను పర్యావరణపరమైన, స్థానికంగా వ్యతిరేకత కారణంగా వివాదాస్పదమైన రద్దు చేసిన 8 ఏళ్ల తర్వాత.. ఈ బిజీ మార్గంలో కట్ అండ్ కవర్ పద్ధతి ద్వారా 3 లేన్ల ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కర్ణాటక కేబినెట్ పరిపాలనా ఆమోదం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 2,215 కోట్లు అని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి జంక్షన్ నుంచి బయటకు.. లోపలికి వచ్చేలా ఒక ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు డౌన్ ర్యాంప్‌ను కూడా నిర్మించనున్నారు.
ముఖ్యంగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఉత్తర బెంగళూరుకు కనెక్ట్ చేసే కీలక ద్వారమైన హెబ్బాల్ వద్ద ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య.. కర్ణాటక ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు చేపడుతోందని.. ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అర్బన్ ప్లానింగ్, డెవలప్‌మెంట్ అనేది సమన్వయంతో చేయడం లేదని.. దీంతో తలకు మించిన బడ్జెట్ అవుతోందని పేర్కొన్నారు.
కర్ణాటక ఆర్థిక శాఖ నుంచి.. అంతర్గతంగా అభ్యంతరాలు వచ్చినా కేబినెట్ మాత్రం.. ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లిందని తేజస్వీ సూర్య తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రతిపాదిత టన్నెల్ కంటే కేవలం 10 శాతం ఖర్చుతోనే పూర్తయ్యే సర్ఫేస్ రోడ్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉందని వాదించారు. ప్రణాళికాబద్ధమైన నార్త్-సౌత్ టన్నెల్‌కు, ఈ కొత్త షార్ట్ టన్నెల్‌కు మధ్య సమన్వయం లేదని.. ప్రాజెక్టు నిధుల విషయంలో అస్పష్టత, ఆ మార్గంలో టన్నెల్ నిర్మించడం సరైందేనని నిరూపించడానికి నిపుణుల మద్దతు లేకపోవడం వంటి అంశాలను కూడా తేజస్వీ సూర్య ప్రస్తావించారు.
ఏది ఏమైనప్పటికీ.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు సిద్ధమైందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని పేర్కొంటూ.. కాంగ్రెస్ పాలన అంచనాకు అందనిదని.. పారదర్శకత, జవాబుదారీతనం లేదని విమర్శించారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్‌కు బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ నిధులు సమకూర్చనుంది. ఈ కొత్త కారిడార్ స్థానిక ట్రాఫిక్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa