ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసర్ కావాలనే కల, వరుసగా వైఫల్యాలు,,,,అయినా వెనకడుగు వేయలేదు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 08:38 PM

"ఈ ప్రపంచంలో వైఫల్యం అనేది చెడ్డ విషయమేమీ కాదు.. ప్రయత్నించకపోవడమే అన్నిటికంటే చెడ్డ విషయం" అని అన్నారు స్వామీ వివేకానంద. ప్రయత్నించే సమయంలో ఓటమి ఎదురైతే.. దాన్ని స్వీకరించి ముందుకు సాగితే సగం విజయం సాధించినట్టే. ఓటమితో కుంగిపోయి జీవితం ఇంతే అనుకుంటే.. పరిస్థితులను మార్చలేం. నిజానికి వైఫల్యాలు.. మనం అనుకున్న లక్ష్యాలకు చేర్చే విజయ సోపానాలు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ జవాన్. 12వ తరగతి పూర్తి చేసి ఆర్మీలో జాయిన్ అయ్యారు. అయితే ఆర్మీ ఆఫీసర్ కావాలనేది ఆయన కల. ఇందుకోసం ఆర్మీ ఆఫీసర్ పరీక్ష క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆరు సార్లు ప్రయత్నించిన విఫలం అయ్యారు. చివరికి ఏడో ప్రయత్నంలో ఆయన కల నెరవేరింది. ఆయనే 32 ఏళ్ల లెఫ్టినెంట్ గురుముఖ్ సింగ్.


గురుముఖ్ సింగ్ 12వ తరగతి పాస్ కాగానే ఆర్మీలో సిపాయ్‌గా చేరారు. అయితే ఆర్మీ ఆఫీసర్ కావాలనేది ఆయన కల. అందులో భాగంగా ఓవైపు డ్యూటీ చేస్తూనే.. మరోవైపు చదువు ప్రారంభించారు. పలు ఆఫీసర్ ఎంట్రీ పరీక్షలు రాశాడు. అన్ని పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నా.. వెనకడుగు వేయలేదు. ఒకటి కాకపోతే మరొకటంటూ పరీక్షలు రాస్తూనే ఉన్నారు. లఢక్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో పోస్టింగ్ వచ్చినా.. తన ప్రయత్నం మాత్రం ఆపలేదు గురుముఖ్ సింగ్. క్రమంగా బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. తన క్వాలిఫికేషన్లను అప్‌గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు.


నెరవేరిన కల..


ఇలా పలు పరీక్షలకు హాజరవుతూనే ఉన్నారు. మూడు సార్లు ఆర్మీ క్యాడెట్ కాలేజీ ఎంట్రన్స్, రెండు సార్లు కమిషన్డ్ ఆఫీసర్స్ ఎంట్రీ పరీక్షలకు హాజరయ్యారు. ఇలా ఆరు సార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు. ఏడో ప్రయత్నంలో ఇండియన్ మిలిటరీ అకాడమీ పరీక్షను క్లియర్ చేశారు గురుముఖ్ సింగ్. అనంతరం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ)లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. శనివారం (డిసెంబర్ 13)న ఆర్మీ ఆఫీసర్ యూనిఫామ్‌లో గురుముఖ్ సింగ్‌ను చూసి.. ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు


దాని వల్లే లక్ష్యం చేరుకోగలిగాను..


ఈ సందర్భంగా తన జర్నీ గురించి గురుముఖ్ వివరించారు. "నేను ఫెయిల్ అయిన ప్రతిసారి.. ఆ విషయాన్ని మా నాన్నకు చెప్పాను. అయన నాపై నమ్మకం కోల్పోలేదు. నేను నా లక్ష్యాన్ని సాధించేవరకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు" అని సింగ్ తెలిపారు. "నాకు కొన్ని సార్లు సరిహద్దు ప్రాంతాల్లో డ్యూటీ వేశారు. దాని వల్ల నా లక్ష్యంపై దృష్టి సారించలేకపోయాను. అయితే పట్టుదలతో సమయం దొరికినప్పుడల్లా చదివాను. ఇలా చేయడానికి క్రమశిక్షణ నాకు ఉపయోగపడింది" అని తెలిపారు. సిపాయ్‌గా సైన్యంలో చేరిన నాటి నుంచి.. ఆర్మీ ఆఫీసర్ కావాలనేది గురుముఖ్ కల అని.. ఈరోజు ఆఫీసర్ యూనిఫామ్‌లో చూడటం తమకు గర్వంగా ఉందని ఆయన తల్లిదండ్రుల సూబేదార్ మేజర్ జశ్వంత్ సింగ్ (రిటైర్డ్), కుల్వంత్ కౌర్ ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబతో గడపడం, మోటివేషనల్ పుస్తకాలు చదవడం వల్ల.. దేశసేవపై ఫోకస్ పెరిగిందని గురుముఖ్ సింగ్ తెలిపారు.


అబ్దుల్ కలాం అన్న మాటలు నిజమయ్యాయి..


మరోవైపు, 19 ఏళ్ల క్రితం ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం పాల్గొన్నారు. తన తండ్రి పక్కన నిలబడి ఉన్న ఓ మూడేళ్ల చిన్నారి చెయ్యి పట్టుకుని.. 'ఇవి ఒక సైనికుడి చేతులు' అని చెప్పారు. ఇప్పుడు ఆ మహానుభావుడి మాటలే నిజమయ్యాయి. ఆ హర్మన్‌మీత్ సింగ్ (22 ఏళ్ల) ఇప్పుడు ఆర్మీలో చేరాడు. 1948 నుంచి హర్మన్ కుటుంబం సైన్యంలో పనిచేస్తూ వస్తున్నారు. హర్మన్ నాలుగో తరం వాడు కావడం విశేషం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa