ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా మరో రైలు నడపనుంది. గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్ స్టేషన్ వరకూ కొత్త ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్యాసింజర్ రైలు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై క్లారిటీ లేదు. గుంతకల్లు - మార్కాపురం మధ్య డైలీ ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపిందని గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. త్వరలో రైలు ప్రారంభ తేదీ ఖరారు కానుందని తెలిపారు.
గుంతకల్లు - మార్కాపురం రోడ్ ప్యాసింజర్ రైలు సర్వీస్ వివరాలు
మరోవైపు గుంతకల్లు - మార్కాపురం ప్యాసింజర్ రైలు(57407) ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు నంద్యాల రైల్వే స్టేషన్‌కు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. 8 గంటల 35 నిమిషాలకు నంద్యాల నుంచి బయల్దేరితే.. మార్కాపూర్ రోడ్డు స్టేషన్‌కు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో మార్కాపురం - గుంతకల్లు రైలు (57408) మార్కాపురంలో తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది. నంద్యాలకు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది. ఐదు నిమిషాల అనంతరం నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరితే.. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గుంతకల్లు - మార్కాపురం - గుంతకల్లు రైలు.. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచర్ల, పాణ్యం. నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట,గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
మరోవైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు.. రైల్వే శాఖ ఈ ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేసింది. మరోవైపు నంద్యాల మీదుగా గుంతకల్లుకు రైళ్లు నడిపించాలని ఈ ప్రాంతవాసులు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు.. అన్నీ కూడా రాత్రిపూట నడుస్తాయని.. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని ఆమె ఇటీవల రైల్వే శాఖ దృష్టికి తెచ్చారు. పగటి పూట ప్రయాణించేలా మెమో లేదా ప్యాసింజర్ రైలును నడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల మీదుగా.. గుంతకల్లు - మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకూ డైలీ ప్యాసింజర్ రైలును రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa