పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం (Imad Wasim) తన భార్య సానియా అశ్ఫక్తో విడాకులు తీసుకున్నాడు. ఆరేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఈ స్పిన్ ఆల్రౌండర్ డైవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.నిత్యం గొడవల కారణంగానే విడాకులు తీసుకున్నామని ఇమాద్ చెబుతున్నప్పటికీ, అసలు కారణం వేరేనని అతడి భార్య సానియా అశ్ఫక్ ఆరోపిస్తోంది. తమ దాంపత్య జీవితం అర్థాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలను బయటపెట్టింది. తన భర్తను మరో మహిళ పెళ్లి చేసుకోవాలనుకుంటోందని, ఆ పరిస్థితిని తాను భరించలేక విడాకులకు అంగీకరించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.ఇమాద్ వసీం, సానియా అశ్ఫక్ల వివాహం 2019 ఆగస్టు 26న జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ జంట విడాకుల బాట పట్టింది. దీనికి మూడో వ్యక్తి జోక్యమే కారణమని సానియా పేర్కొంది.‘మనసునిండా బాధతో ఈ పోస్ట్ రాస్తున్నాను. నా హృదయం పూర్తిగా విరిగిపోయింది. నా పిల్లలు తమ తండ్రికి దూరమయ్యారు. నేను ముగ్గురు పిల్లలకు తల్లిని. విడాకులపై ఇప్పటివరకు మౌనంగా ఉండడానికి కారణం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది.‘ప్రతి కుటుంబంలాగే మా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ భార్యగా, తల్లిగా నేను పూర్తి బాధ్యతతో వ్యవహరించాను. నా కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా ప్రయత్నించాను. కానీ ఒక మూడో మహిళ జోక్యం వల్ల మా బంధం పూర్తిగా దెబ్బతింది. నా భర్తను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె వ్యవహరించింది. ఆ పరిస్థితిని నేను అంగీకరించలేకపోయాను. అందుకే ఇమాద్తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని సానియా వెల్లడించింది.అయితే ఈ ఆరోపణలను ఇమాద్ వసీం ఖండిస్తున్నాడు. నిత్యం జరుగుతున్న గొడవల కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అతడు కోరుతున్నాడు.క్రికెట్ విషయానికి వస్తే, టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఇమాద్ వసీం, గత డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్ జెర్సీతో అతడు 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో ఇమాద్ వసీం సభ్యుడిగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa