2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం వంటి కీలక పరిణామాలకు ఈ ఏడాది సాక్ష్యంగా నిలిచింది. ఎన్నికల హామీకి అనుగుణంగా రాజధాని పనులను పట్టాలెక్కించడం ఈ ఏడాదికే తలమానికంగా నిలిచింది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్ ఓ కథనం వెలువరించింది.దాదాపు పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి పనులను, 2025 మే 2న ఆయన చేతుల మీదుగానే మళ్లీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కలల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నారు. హైకోర్టు, శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల వంటి రూ. 56,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు తిరిగి మొదలయ్యాయి. 2028 మార్చి నాటికి ఈ పనులు పూర్తిచేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అమరావతిలో రెండో దశ భూ సమీకరణకు కూడా శ్రీకారం చుట్టారు. అమరావతిని అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో 'క్వాంటమ్ వ్యాలీ'గా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహంలో విశాఖపట్నంలో గూగుల్ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఒక మైలురాయిగా నిలిచింది. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొన్న ప్రకారం, ఈ పరిణామం విశాఖ రూపురేఖలను మార్చేస్తుందని ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. గూగుల్ ఐదేళ్లలో పెట్టనున్న 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1.88 లక్షల మందికి ఉపాధి లభించనుంది. గత 16 నెలల్లో రాష్ట్రం 120 బిలియన్ డాలర్ల సుమారు రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఏకంగా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 610 ఎంఓయూలు కుదిరాయి.రాష్ట్రంలో మూడు ఆర్థిక కారిడార్లను అభివృద్ధి చేస్తూ 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ ప్రాంతాల్లో ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్న 'సూపర్ సిక్స్' హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.సంక్షేమ రంగంలోనూ ప్రభుత్వం తనదైన ముద్ర వేసింది. 'తల్లికి వందనం' పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,090 కోట్లు అందించారు. ఆగస్టు 15న ప్రారంభించిన 'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే, 'అన్నదాత సుఖీభవ' కింద 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,310 కోట్లు జమ చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద 63 లక్షల మందికి ఏటా రూ. 33,000 కోట్ల పింఛన్లు అందిస్తున్నారు.పరిపాలనలో పారదర్శకత కోసం వాట్సాప్ గవర్నెన్స్, విపత్తుల నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు వంటి ఆధునిక పద్ధతులను ప్రభుత్వం అనుసరిస్తోంది. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో 'పీ4' కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ ఏడాదిలోని మరో విశేషం. మొత్తం మీద 2025 సంవత్సరం అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ ప్రణాళికలతో ఏపీకి ఒక బలమైన పునాది వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa