ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ కు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 08:53 PM

రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో కీలకమని, గత ప్రభుత్వ హయాంలో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల  రద్దు వంటి నిర్ణయాల వల్ల చాలా కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సుస్థిర పాలన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. పుణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పబ్లిక్ పాలసీ ఫెస్టివల్’లో లోకేశ్ కీలకోపన్యాసం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు క్యూ కట్టడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేశ్ వివరించారు. "మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం. రెండోది 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'. పరిశ్రమలతో ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి వేగంగా అనుమతులు ఇస్తున్నాం. మూడోది రాష్ట్రంలో, కేంద్రంలో 'నమో'  నేతృత్వంలోని డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్" అని తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్‌తో ఒకేఒక్క జూమ్ కాల్ మాట్లాడి, వారి సమస్యను 24 గంటల్లో పరిష్కరించడం వల్లే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏపీకి తీసుకురాగలిగామని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.పరిపాలనలో టెక్నాలజీని వినియోగిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు.మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యి రకాల సేవలను అందిస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో మంగళగిరిలో స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. త్వరలోనే భూ రికార్డులను కూడా బ్లాక్‌చైన్ టెక్నాలజీపైకి తీసుకొచ్చి, 24 గంటల్లో టైటిల్ మార్పు చేసేలా కసరత్తు చేస్తున్నాం" అని వివరించారు.ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు 'లిఫ్ట్'  పాలసీని తీసుకొచ్చామని లోకేశ్ తెలిపారు. ఒక ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయించేలా ఈ విధానాన్ని రూపొందించామని, కాగ్నిజెంట్ రాకతో పరిశ్రమల ప్రవాహం మొదలైందని చెప్పారు. పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను తానే స్వయంగా 26 వాట్సాప్ గ్రూపుల ద్వారా పర్యవేక్షిస్తున్నానని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్వాంటమ్ వ్యాలీ అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ అని లోకేశ్ అభివర్ణించారు. అమరావతిలో ఏర్పాటు కానున్న ఈ వ్యాలీ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ను అమలు చేసేందుకు యువ మంత్రుల బృందంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని, రాష్ట్రానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa