టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన మరో కంపెనీ ఎక్స్‌ఏఐ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థకు చెందిన గ్రోక్ ఏఐని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు.. మహిళల న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రముఖుల ఫోటోలను న్యూడ్‌గా ఎడిట్ చేస్తున్నారు. గ్రోక్ ఏఐకి సాధారణ ఫొటోలు ఇచ్చి.. వాటిని బికినీలో, న్యూడ్‌గా ఇవ్వాలంటూ అడుగుతున్నారు. దీంతో ఈ సంస్థపై పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అసభ్యకరంగా ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 72 గంటల్లో అలాంటి పోస్టులను తొలగించాలని భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు.. ఎక్స్ స్పందించింది.
ఎక్స్‌లోని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ ఏఐను వాడి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధంగా సృష్టించిన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎక్స్.. 3500 పోస్టులను బ్లాక్ చేసింది. అంతేకాకుండా 600 ఖాతాలను డిలీట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరాలు వెల్లడించాయి. కాగా, ఎక్స్ తన తప్పును ఒప్పుకుందని.. అలాగే తమ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీలం, అసభ్యతకు చోటు ఇవ్వబోమని, భారతీయ చట్టాలకు లోబడి పని చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపాయి.
కాగా, విమర్శలపై ఇప్పటికే స్పందించిన ఎలాన్ మస్క్.. ఎక్స్‌లో అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా గ్రోక్‌తో ఇమేజ్ జనరేషన్ చేసే ఫీచర్‌పై ఇప్పటికే ఎక్స్ పరిమితులు విధించింది. ఆ ఫీచర్‌ను ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లించిన వారు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ఎక్స్‌లో పోస్టు చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని చెప్పింది. వాటిని అప్‌లోడ్ చేసిన ఖాతాలను డిలీట్ చేస్తామని పేర్కొంది. అందులో భాగంగానే తాజాగా చర్యలు చేపట్టింది.
కాగా, గ్రోక్ ఏఐ దుర్వినియోగం చేయడంపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆందోళనలను వ్యక్తం చేసింది. ప్రాంప్ట్‌లు, ఇమేజ్ మానిప్యులేషన్, సింథటిక్ అవుట్‌పుట్‌ల ద్వారా ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల, అసభ్యకరమైన చిత్రాలను రూపొందిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా అలాంటి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడానికి గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇటువంటి కంటెంట్.. సమాచార సాంకేతిక చట్టం, 2000.. సమాచార సాంకేతికత నియమనిబంధనలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే ఐటీ చట్టం, నియమాలను.. సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే గ్రోక్.. సమగ్ర సాంకేతిక, గవర్నెన్స్ లెవెల్ సమీక్ష నిర్వహించాలని.. వినియోగదారుల పాలసీలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa