అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ట్రంప్ చర్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు చేపడుతున్న చర్యలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ఈ ఫెడరల్ ఏజెంట్స్.. మిన్నెసొటాకు చెందిన అమెరికా పౌరుడు ఎలెక్స్ జెఫ్రీ ప్రిట్టీ (37) అనే వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ట్రంప్, ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా దేశప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మూడు వారాల్లోనే రెండోసారి ఇలా జరగడం కలకలం సృష్టిస్తోంది.
శనివారం ఉదయం 9 గంటల సమయంలో మిన్నియాపాలిస్‌లో ఐసిఈ అధికారులతో జరిగిన ఘర్షణలో 37 ఏళ్ల అలెక్స్ జెఫ్రీ ప్రెట్టీ అనే మరో అమెరికా పౌరుడు మరణించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. అధికారులు అతడి వైపు వస్తున్నప్పుడు.. ప్రెట్టి ఒక మొబైల్ ఫోన్ పట్టుకుని ఉండటం కనిపిస్తోంది. ఆ తర్వాత ఐసీఈ అధికారులతో అతడు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో జరిగిన గందరగోళం తర్వాత.. ఒక ఫెడరల్ ఏజెంట్.. ప్రెట్టీ ముందుకు వచ్చినప్పుడు అతడిపై పెప్పర్ స్ప్రే చల్లాడు. అనంతరం కొంతమంది అధికారులు.. ప్రెట్టిని కిందకు తోసేశారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్.. ప్రెట్టి నడుము దగ్గర నుంచి హ్యాండ్‌గన్‌ను లాగుతున్నట్లు కనిపిస్తోంది. వెంటనే.. అధికారులు అతడిపై కాల్పులు జరిపారు. అయితే ప్రెట్టి కుప్పకూలిన తర్వాత కూడా, ఇద్దరు ఏజెంట్లు కాల్పులు జరుపుతూనే ఉండటం.. దాదాపు ఐదు సెకన్లలో కనీసం పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు వీడియోల్లో కనిపిస్తోంది.
కాగా, ప్రిట్టీ వద్ద నుంచి తుపాకీ తీసుకునే క్రమంలో ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. అయితే, బాధితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ప్రిట్టి వద్ద ఎలాంటి ఆయుధం లేదని.. నిరసనల్లో పాల్గొంటున్న ఓ మహిళను ప్రిట్టి కాపాడే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు కాల్పులు జరిపారని అంటున్నారు. అతడు ఒక నర్స్ అని.. వెటరన్స్‌కు సేవ చేస్తాడని చెబుతున్నారు.
గవర్నర్ ఆగ్రహం..
ఈ ఘటనపై స్పందించిన మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల కట్టడి చర్యలను వెంటనే నిలిపివేయాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. సరైన శిక్షణ లేని వేల మంది ఫెడరల్ అధికారులు రాష్ట్రానికి వచ్చారని.. వారందరినీ అమెరికా కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు పిలిపించాలని డిమాండ్ చేశారు.
మూడు వారాల్లో రెండోసారి..
కాగా, జనవరి 7న కూడా మిన్నెసోటా నివాసి రెనీ గుడ్‌ను.. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్చి చంపారు. ఈ హత్య తర్వాత నగరంలో అనేక నిరసనలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఐసీఈ అధికారులు మరో వ్యక్తిని కాల్చి చంపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ అధికారులు చేసిన చర్యను సమర్థించుకున్నారు.
ఆత్మరక్షణలో భాగంగానే : ట్రంప్
మిన్నెసోటా ఘటనపై ట్రూత్ సోషల్‌లో స్పందించిన ట్రంప్.. ఒక గన్ ఫొటోను పోస్ట్ చేశారు. "ఇది ఆ గన్‌మ్యాన్ తుపాకీ. (అదనంగా రెండు నిండు మ్యాగజైన్‌లతో!), లోడ్ చేసి కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉంది – ఇదంతా ఏమిటి? స్థానిక పోలీసులు ఎక్కడ ఉన్నారు? ICE అధికారులను రక్షించడానికి స్థానిక పోలీసులు ఎందుకు రాలేదు? మేయర్, గవర్నర్ వారిని వెనక్కి పిలిపించారా? ICE అధికారులే తమను తాము రక్షించుకోవలసి వచ్చింది" అని ట్రంప్ చెప్పారు.
కాగా, మిన్నెసోటా డెమోక్రాట్లపై ఆరోపణలు గుప్పించారు ట్రంప్. డెమోక్రాట్ల వల్ల అక్రమ వలసదారులు వచ్చి బిలియన్ల డాలర్ల కొద్దీ దోచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మేయర్, గవర్నర్ తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆ దోపిడీని అరికట్టడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి బాధ్యతను వారు నిర్వర్తించనీయండీ అని అన్నారు. ఇప్పటికే 12,000 మంది అక్రమ ఏలియన్ నేరగాళ్లను అరెస్ట్ చేసి మిన్నెసోటా నుంచి తీసేశామని.. వారు ఇంకా అలాగే మిన్నెసోటాలో ఉంటే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa