ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ వైపు దూసుకొస్తున్న అమెరికా యుద్ధనౌకలు,,,,,పెరుగుతున్న ఉద్రిక్తతలు

international |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 09:02 PM

ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను అక్కడ ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఈ క్రమంలో నిరసనలకు అమెరికా బహిరంగంగానే మద్దతు తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయొచ్చని సీనియర్ మిలిటరీ అధికారులు చెప్పిన నేపథ్యంలో.. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టెహ్రాన్‌లోని ఓ బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ బంకర్‌ టెహ్రాన్‌లోని పలు సొరంగ మార్గాలకు కనెక్ట్ చేయబడి ఉన్నట్లు సమాచారం.


కాగా, సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ బంకర్‌లోకి వెళ్లగా.. ఆయన రోజువారీ వ్యవహారాలు ఆయన చిన్న కొడుకు మసూద్ ఖమేనీ చూసుకుంటున్నట్లు.. అమెరికా విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ.. ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. అత్యవసర సమయాల్లో ఇరాన్ కార్యనిర్వాహక వర్గంతో మసూద్ సమన్వయం చేస్తున్నారని తెలిపింది.


అమెరికా హెచ్చరిక..


అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. అమెరికన్ యుద్ధ నౌకల సమూహం (armada) మిడిల్ ఈస్ట్ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. ఇరాన్‌పై చర్య తీసుకోవాలని తాను నిర్ణయించుకుంటే.. వెంటనే దాడులు చేసేలా మోహరింపు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా నావికాదళ అధికారులు కూడా ధ్రువీకరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ USS అబ్రహం లింకన్, అనేక గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లుతో ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో మోహరించామని, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్‌కు వెళుతుందని వెల్లడించారు.


ఇరాన్ కౌంటర్..


అమెరికా హెచ్చరికకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మొహమ్మద్ పక్‌పూర్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ఆదేశాలను అమలు చేయడానికి ఇరాన్ దళాలు.. ట్రిగ్గర్‌పై వేలు పెట్టి, గతంలో కన్నా సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, ఇరాన్‌పై ఎలాంటి దాడిని అయినా.. పూర్తి స్థాయి యుద్ధంగా పరిగణిస్తామని.. సాధ్యమైనంత కఠినమైన మార్గంలో స్పందిస్తామని ఆ దేశ సీనియర్ అధికారి ఓ మీడియా సంస్థతో చెప్పారు.


కాగా, ఆర్థిక సంక్షోభం, జాతీయ కరెన్సీ రియాల్ పతనం కారణంగా.. ఇరాన్‌లో నిరసనలు ఉద్ధృతమయ్యాయి. అనంతరం హింసాత్మకంగా మారాయి. అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ (హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ అణచివేత చర్యల్లో దాదాపు 5,002 మంది మరణించారు. వీరిలో 4,716 మంది నిరసనకారులు, 43 మంది చిన్నారులతో పాటు నిరసనలలో ప్రత్యక్షంగా పాల్గొనని 40 మంది పౌరులు ఉన్నట్లు పేర్కొంది. కనీసం 26,541 మందిని అరెస్టు చేసినట్లు నివేదించింది. అయితే ఇరాన్ అధికారులు ఈ గణాంకాలను ధ్రువీకరించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa