ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా,,,ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్‌లో 14 ప్లాట్‌ఫాంలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 07:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సమీక్షలు చేస్తున్నారు. అయితే వాల్తేరు డివిజన్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలకు విస్తరించే దిశగా అడుగులుపడుతున్నాయి. కొత్త లైన్లు లేకపోవడం వల్ల, వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లు ఆలస్యమవుతున్నాయి. కొన్ని ప్యాసింజర్ రైళ్లను పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్లలో ఎక్కువసేపు నిలిపివేస్తున్నారు. సరుకు రవాణా రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్త లైన్ల నిర్మాణంపై దృష్టి సారించారు.


అలాగే ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫాంలు మాత్రమే అదుబాటులో ఉన్నాయి. ఇవి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో రైల్వేబోర్డు అధికారులు స్టేషన్‌ను పరిశీలించి.. ప్లాట్‌ఫాంల సంఖ్యను 8 నుంచి 14కు పెంచాలని నిర్ణయించారు. రెండు అదనపు రైల్వే ట్రాక్‌లను కూడా నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతంలో.. 13, 14 నంబర్ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి ఇప్పటికే మార్కింగ్ చేశారు. భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ విస్తరణ పనులు పూర్తయితే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.


విశాఖపట్నం రైల్వే మార్గంలోకీలకమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దువ్వాడ-ఉత్తర సింహాచలం మధ్య రూ.302.25 కోట్లతో 20.5 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ కొత్త లైన్ల నిర్మాణం వల్ల రైల్వే వ్యవస్థలో సామర్థ్యం పెరుగుతుంది. దువ్వాడ నుండి ఉత్తర సింహాచలం వరకు నిర్మించబోయే మూడో, నాలుగో లైన్లు విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అదనపు మార్గాన్ని అందిస్తాయి. దీనితో ప్రయాణ సమయం తగ్గుతుంది. రైళ్లు ఆలస్యం కాకుండా సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటాయి.


విశాఖ-గోపాలపట్నం స్టేషన్ల మధ్య రూ.159.47 కోట్లతో 15.31 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రైళ్లను స్టేషన్ బయటే ఆపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త లైన్లు పూర్తయితే, ఒకేసారి ఎక్కువ రైళ్లను స్టేషన్లలోకి అనుమతించవచ్చు. దీనితో రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి.


పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య రూ.183.65 కోట్లతో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు.. 7.13 కిలోమీటర్ల పొడువున ఈ ప్రాజెక్ట్ సర్వే పనులు పూర్తిచేసి భూసేకరణ కూడా ముగింపు దశలో ఉంది. ఈ ఫ్లై ఓవర్‌తో ఉత్తర సింహాచలం నుంచి దువ్వాడకు వెళ్లే సరకు రవాణా రైళ్లు ఆగకుండా వెళ్తాయి. వడ్లపూడి-గేట్‌ కేబిన్‌ కూడలి మార్గంలో నిర్మిస్తున్న ఈ కొత్త లైన్లు గంగవరం పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంటి కీలక పారిశ్రామిక ప్రాంతాలకు ఎంతో ఉపయోగపడతాయి. రూ.154.28 కోట్లతో గంగవరం పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మీదుగా మూడు, నాలుగో లైన్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి సరకు రవాణా మరింత సులభతరం అవుతుంది. రైల్వే మెకానికల్‌ డిపోలకు కూడా ఈ లైన్లు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa