భద్రతాపరమైన ఆందోళనలు, నేరాలు, అంతర్గత కలహాలు, తీవ్రవాదం వంటి ముప్పు ఉన్నందున పాకిస్థాన్‌కు ప్రయాణాల విషయంలో పునరాలోచించుకోవాలని తన పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. తాజాగా విడుదల చేసిన అడ్వైజరీలో ఉగ్రదాడుల అత్యధిక ముప్పు ఉన్న ‘లెవెల్ 3’ విభాగంలో పాకిస్థాన్‌ను చేర్చింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. విదేశాంగ శాఖ ప్రకారం సాధారణ లక్ష్యాలలో రవాణా కేంద్రాలు, హోటళ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక, రక్షణ కేంద్రాలు, రైళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు, పర్యటక కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.
అలాగే, బలూచిస్థాన్, ఖైబర్‌పఖ్తుంఖ్వా సహా పలు ప్రాంతాలను అసలు పర్యటించకూడదని, అత్యంత ప్రమాదకరమైన లెవెల్-4లో ఇవి ఉన్నాయని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతాలకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రయివేట్ పౌరులు వెళ్లొద్దని, హత్యలు, కిడ్నాప్‌లు అక్కడ సర్వసాధారణమని హెచ్చరించింది. పాకిస్థాన్‌లో అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించడం స్థానిక చట్టాల ప్రకారం నిషేధమని అడ్వైజరీలో స్పష్టంగా తెలిపారు. గతంలో ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అమెరికా పౌరులను నిర్బంధించారని పేర్కొంటూ, ప్రజలు అలా చేయవద్దని కోరింది.
‘పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం లేదా అధికారులను విమర్శించే కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కూడా మీరు నిర్బంధాన్ని ఎదుర్కోవలసి రావచ్చు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదం పెరుగుదులతో పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న వేళ అమెరికా నుంచి ఈ అడ్వైజరీ వెలువడింది.
లెవెల్ 1: ‘సాధారణ జాగ్రత్తలు పాటించండి' అనేది అత్యల్ప స్థాయి సలహా. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిస్తుంది. సందర్శన సమయంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తుంది.
లెవెల్ 2: ‘అదనపు జాగ్రత్తలు తీసుకోండి’ అనేది ఆ ప్రాంతంలో భద్రత, భద్రతకు అధిక ప్రమాదం ఉన్నప్పుడు జారీ చేస్తుంది. ప్రయాణాలు చేసేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
లెవెల్-3: తీవ్రమైన భద్రతా ప్రమాదాల విషయంలో ప్రయాణాలపై పునరాలోచన చేయాలని సూచించడం. ప్రయాణికులు ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించాలని సలహా ఇస్తుంది.
లెవెల్ 4: ‘ప్రయాణం చేయవద్దు’ అనేది అత్యున్నత స్థాయి సలహా. వివిధ కారణాల వల్ల ఏదైనా ప్రాంతానికి వెళ్లొద్దని గట్టిగా సిఫార్సు చేస్తుంది, వాటిలో ఒకటి అమెరికా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో తమ పౌరులకు ఎటువంటి సహాయం అందజేయలేకపోవచ్చు.
కాగా, జనవరి 24న ఖైబర్ పఖ్తూంఖ్వా డేరా ఇస్మాయీల్ ఖాన్ జిల్లాలోని వివాహ వేడుకలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. అతిథిగా నటిస్తూ ఇంటిలోకి వచ్చిన అనుమానితుడు.. సంగీత కార్యక్రమంలో పేలుడుకు తెగబడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa