ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి గట్టిగానే కొడతాం,,, ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 09:13 PM

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. అణ్వాయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి చాలా తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’‌లో పోస్ట్ పెట్టారు. అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలోని అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తోందని, అవసరమైతే దూకుడుతో మిషన్‌ను నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు.


మూడు యుద్ధనౌకలతో కూడిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ మంగళవారం పశ్చిమాసియాకు చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఈ యుద్ధనౌకలు పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ బెదిరింపులకు దిగారు. సమయం చాలా ముఖ్యమైందని, అణ్వాయుధాలపై న్యాయమైన, సమానమైన ఒప్పందం కోసం ఇరాన్ వెంటనే చర్చలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.


‘ఇరాన్ త్వరలో చర్చలకు వచ్చే అవకాశం ఉంది. అణుయేతర ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. అది అన్ని పార్టీలకు మంచిది. సమయం మించిపోతోంది, అదే నిజంగా ముఖ్యమైనది’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో రాశారు. గతంలో అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’‌ను ప్రస్తావించిన ట్రంప్.. అదే తప్పులను పునరావృతం చేయవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. ‘తదుపరి దాడి చాలా దారుణంగా ఉంటుంది.. మళ్లీ అలా జరగనివ్వకండి’ అని బెదిరింపులకు దిగారు. సైనిక బెదిరింపుల ద్వారా దౌత్యం జరగదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చి వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ తాజా బెదిరింపులు వచ్చాయి.


అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వేలాది మంది మరణించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హత్యలను ఆపాలని లేకుంటే, తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. తర్వాత ఇరాన్ అధికారులు తమకు మాట ఇచ్చారని, ఇక నిరసనకారుల అణచివేత ఉండదని ప్రకటన చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa