ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ స్లీపర్ రైలుకు.. మరిన్ని కోచ్‌లు, బెర్త్‌లు, ప్యాంట్రీ కార్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 08:40 PM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా విజయవంతం కావడంతో.. రైల్వే శాఖ.. వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలె దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. హౌరా నుంచి గువహటి మధ్య జెండా ఊపి ప్రారంభించారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇప్పుడు 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపొందించే పనిలో పడింది. ప్రస్తుతం ఉన్న 16 కోచ్‌ల స్లీపర్ రైళ్లతో పోలిస్తే.. ఇవి మరింత ఎక్కువ సామర్థ్యాన్ని, మెరుగైన సౌకర్యాలను అందించనున్నాయి.


ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైళ్లలో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా తయారు చేయనున్న రైళ్లలో 24 కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుత 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లలో 823 బెర్త్‌లు ఉంటే.. 24 కోచ్‌ల వెర్షన్‌లో ఏకంగా 1,224 బెర్త్‌లు అందుబాటులోకి వస్తాయి. అంటే 401 మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.


ఈ 24 కోచ్‌లలో17 ఏసీ 3 టైర్ కోచ్‌లు.. 5 ఏసీ 2 టైర్ కోచ్‌లు.. 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉండనుంది. వీటితోపాటు.. ప్రత్యేకంగా ఒక ఏసీ ప్యాంట్రీ కార్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది వందే భారత్ స్లీపర్ రైలులో ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


ప్రయాణికుల సౌకర్యాలు


సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ రైళ్లలో అత్యాధునిక ఫీచర్లను జోడిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణాల్లో వేడివేడి ఆహారాన్ని అందించేందుకు పూర్తిస్థాయి ఏసీ ప్యాంట్రీ కార్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎర్గోనామిక్ డిజైన్ కలిగిన అత్యాధునిక బెర్త్‌లు.. ప్రతి బెర్త్‌కు రీడింగ్ లైట్, మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు.. మెరుగైన పరిశుభ్రత కోసం వ్యాక్యూమ్ అసిస్టెడ్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైలు ప్రయాణికులకు ఎంటర్‌టైన్‌మెంట్, సమాచారం కోసం వై ఫై ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, వీల్ చైర్ ర్యాంప్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.


టెక్నాలజీ, సెక్యూరిటీ


ఈ వందే భారత్ స్లీపర్ రైలు వేగం గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ భద్రతా వ్యవస్థను ఈ రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. శబ్ద కాలుష్యం లేకుండా ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ ద్వారా ప్రయాణికులకు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తుంది.


ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?


ఈ 24 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు డిజైన్ దశలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైలు నమూనా 2026 చివరి నాటికి పట్టాలెక్కే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa